కొత్త సీసాలో పాత సారా పోయడం…పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం…అందులోనూ తన పేరు, తన తండ్రిపేరు వచ్చేలా పెట్టడం సీఎం జగన్ కు అలవాటే. ఈ కోవలోనే తాజాగా పాతదైన పథకానికి రంగులు దిద్ది ‘వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్స్ ప్రెస్’ పథకం అంటూ జగన్ ఈరోజు నానా హడావిడి చేసి ప్రారంభించారు. డెలివరీ అయిన తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం పాతదే. ఈ నేపథ్యంలో ఈ పథకం లాంచ్ చేసిన జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు గర్భానికి, గర్వానికి తేడా తెలీదని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. ఈ పథకం గతంలో కూడా ఉండేదని, దాని పేరు మార్చి వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారని చురకలంటించారు. తూర్పుగోదావరి జిల్లా గంగవరంలోని రామాలయంలో క్రైస్తవ మత ప్రచారం చేయడం దారుణమని రఘురామ మండిపడ్డారు. ఇక, రూ.300 కోట్లు ఖర్చు పెట్టి వాలంటీర్లకు సన్మానం అవసరమా? అంటూ జగన్ వైఖరిని రఘురామ నిలదీశారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలని విన్నవిస్తున్నానని సెటైర్లు వేశారు.
ఇక, ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలపై రఘురామ ఫైర్ అయ్యారు. సర్దుబాటు (ట్రూఅప్) అంటే అసమర్థుడి పన్ను అని, ప్రభువుల చేతగానితనాన్ని సర్దుబాటు చేసుకునేందుకు వేసిన పన్ను అని పంచ్ లు వేశారు. ఐదేళ్ల పాలనలో 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చంద్రబాబును పెద్ద మనిషి అని.. ఇంకేదో అని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎటకారంగా మాట్లాడారని, మరి మూడేళ్ల పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వారిని చిన్న మనుషి అనాలా.. చేతగానివారు అనాలా? అంటూ చురకలంటించారు.
చంద్రబాబు కొద్ది మొత్తంలో విద్యుత్ ఛార్జీలు పెంచితేనే ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడాలని జగన్ పిలుపునిచ్చారని, మరి భారీగా విద్యుత్ చార్జీలు వడ్డించిన జగన్ ను ప్రజలు ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటికే కరెంటు కోతలు విధిస్తున్నారని.. ఈ కోతలను జగన్ ఉగాది దీవెన.. కానుక అనుకోవాలా అని రఘురామ నిలదీశారు. ఏది ఏమైనా… జగన్, వి.సా రెడ్డిలకు రఘురామ తాజా విన్నపం…సోషల్ మీడియాలో వైరల్ అయింది.