టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను బండి సంజయ్ లెక్కచేస్తున్నట్లు లేదు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఎవరి పాత్ర ఎంత అన్నది తేల్చటానికే ప్రభుత్వం సిట్ ను నియిమించింది. లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వంతో పాటు కేటీయార్, కవిత మీద చాలా ఆరోపణలు చేశారు. జగిత్యాల మండలంలో వందమందికి గ్రూప్ 1 లో మంచి ర్యాంకులు వచ్చిన విషయమై ఆరోపించారు.
మండలంలో ఎవరెవరికి ర్యాంకులు వచ్చాయి ? వాళ్ళందరికీ ఎలా వచ్చాయనే విషయంపై బండి చేసిన ఆరోపణలు చాలా వైరల్ అయ్యాయి. అందుకనే విచారణకు హాజరై తన దగ్గరున్న సాక్ష్యాలను, సమాచారాన్ని అందించాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దానికి బండి సమాధానమిస్తు తాను బీదర్ వెళుతున్నట్లు చెప్పారు. కాబట్టి విచారణకు తనకు బదులు లీగల్ టీము హాజరవుతుందని కూడా లేఖలో చెప్పారు. విచారణకు బండి గైర్హాజరవ్వటం ఇది రెండోసారి.
మొన్ననే 24వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిన బండి ఏదో కారణంచెప్పి గైర్హాజరయ్యారు. అప్పుడు రాలేదు కాబట్టి 26వ తేదీన అంటే ఈరోజు విచారణకు రమ్మని చెప్పింది. అయితే ఆదివారం నాడు కూడా విచారణకు హాజరవ్వటం సాధ్యంకాదని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే బండికి విచారణ సంస్ధలపై ఎలాంటి గౌరవం లేదని అర్ధమైపోతోంది. విచారణకు హాజరవ్వకపోవటానికి ఏదో అనారోగ్యమో లేకపోతే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమమో ఉందంటే అర్ధముంది.
అంతేకానీ పార్లమెంటు సమావేశాలున్నాయని, పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీదర్ వెళుతున్నానని చెప్పి విచారణకు గైర్హాజవుతున్నారంటే అర్ధమేంటి ? విచారణకు హాజరుకాకపోయినా తనను సిట్ ఏమీచేయలేదన్న ధైర్యమే కనబడుతోంది. కేంద్రంలో అధికారాన్ని చూసుకునే బండి ఇలాగ వ్యవహరిస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఈ విషయాలు తెలిసే సిట్ కూడా ఏమీ చేయలేపోతున్నది. ఇవే ఆరోపణలు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా సిట్ విచారణకు పిలిచింది. విచారణకు రేవంత్ హాజరయ్యారు. అంటే సిట్ విచారణంటే బండికి లెక్కలేనట్లుంది చూస్తుంటే.