ఒక పెదరాయుడు.. ఒక అసెంబ్లీ రౌడీ.. ఒక అల్లుడు గారు.. ఒక అల్లరి మొగుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే హీరోగా మోహన్ బాబు కెరీర్లో ఎన్నో విజయాలు. ఇక విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన పాత్రలు, అందుకున్న విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో 500కు పైగా సినిమాలు చేసి.. 50కి పైగా సినిమాలను స్వయంగా నిర్మించి.. నటనలో, డైలాగ్ డెలివరీలో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరుచుకుని తిరుగులేని స్థాయిని అందుకున్న నటుడాయన. ఇదీ ఘనమైన ఆయన గతం.
ఇప్పుడిక వర్తమానంలోకి వద్దాం. ‘సన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆయన కొత్త సినిమా ఒకటి విడుదలైంది. ఈ చిత్రాన్ని బుకింగ్స్ ఓపెన్ చేస్తే విడుదలకు ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ థియేటర్లోనూ రెండంకెల సంఖ్యలో టికెట్లు అమ్ముడవలేదు. కొన్ని చోట్ల ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా బుక్ కాని పరిస్థితి.
ఇక రిలీజ్ రోజు ప్రేక్షకులు లేక.. బుకింగ్స్ మరీ కనీస స్థాయిలో ఉండటం వల్ల ఏపీ, తెలంగాణల్లో కలిపి వందకు పైగా మ్యాట్నీ షోలు రద్దయ్యాయి. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. అసలు మోహన్ బాబు లాంటి లెజెండరీ యాక్టర్ హీరోగా చేసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడం.. ఆయన సినిమాను థియేటర్లో ఆడిరచాలంటే ఎదురు డబ్బులు పెట్టాల్సి రావడం అనూహ్యం.
90వ దశకంలో టాలీవుడ్ టాప్ స్టార్లతో పోటీ పడుతూ ఘనవిజయాలందుకున్న నటుడు మోహన్ బాబు. కానీ ఆయన వైభవమంతా 2000 ముందు వరకే. ఆ తర్వాత వరుస పరాయాలతో వెనుకబడిపోయారు. కొత్త తరం హీరోలతో ఏమాత్రం పోటీ పడలేకపోయారు. చూస్తుండగానే మార్కెట్ మొత్తం పడిపోయింది. ఫ్లాపులు ఎదుర్కోవడానికి తోడు.. సినిమాలు కూడా తగ్గించేయడంతో మోహన్ బాబును అంతా మరిచిపోయారు.
ఈ తరం ప్రేక్షకులతో ఆయనకు పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోయింది. కాలానికి తగ్గట్లు మారకుండా తానో లెజెండరీ నటుడినని, ఇప్పటికీ తనను చూడటానికి ప్రేక్షకులు ఎగబడతారని, ఇప్పటికీ కలెక్షన్ కింగ్‌నే భావనలో ఉంటారు మోహన బాబు. ఆయన మాటల్ని చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ట్రెండ్‌ను అర్థం చేసుకోకుండా ‘గాయత్రి’ అనే ఔట్ డేటెడ్ సినిమా చేసి మూడేళ్ల కిందట తల బొప్పి కట్టించుకున్న ఆయన.. ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’తో తెలుగులో ఏ స్టార్‌కూ ఎదురుకాని దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
ఎందుకింత వ్యతిరేకత?
అసలింతకీ మోహన్ బాబు సినిమాకు ఈ స్థాయిలో పరాభవం ఎందుకు ఎదురైంది అన్నది చర్చనీయాంశం. కాలానుగుణంగా మారకపోవడం, సరైన సినిమాలు ఎంచుకోకపోవడం.. తనకు సూటయ్యే పాత్రలు చేయకపోవడం.. ఇలాంటి ‘సినిమా’ సంబంధిత కారణాలకు తోడు వేరే అంశాలు కూడా మోహన్ బాబుతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోవడానికి కారణాలన్నది స్పష్టం. సినిమాలను పక్కన పెట్టి చూస్తే.. మోహన్ బాబు అహంకారం, ఆత్మస్తుతి-పరనింద తరహా వైఖరి.. వివిధ సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన పట్ల జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెంచాయన్నది స్పష్టం.
ముఖ్యంగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల సందర్భంగా ఎన్నడూ తనను పల్లెత్తు మాట అనని చిరంజీవిని చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం.. ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడటం.. వక్రమార్గంలో విష్ణును ‘మా’ అధ్యక్షుడిగా గెలిపించుకుని విర్రవీగడం.. ఎన్నికల ముందు జగన్‌కు మద్దతుగా ప్రచారం చేసి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలపై మాట్లాడకుండా ఇప్పటికీ వీలు దొరికినపుడల్లా ఏపీ సీఎంను కీర్తిస్తుండటం, ఏపీలో టికెట్ల రేట్లు సహా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయకుండా ‘ఇండస్ట్రీ పెద్ద’ అనిపించుకోవడానికి తహతహలాడుతుండటం.. ఇలా మోహన్ బాబుపై జనాల్లో ఏహ్యభావం పెంచాయన్నది విశ్లేషకుల మాట.
‘మా’ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత మోహన్ బాబు, విష్ణు చేసిన అతిని గమనిస్తూ సమయం కోసం చూస్తూ వస్తున్న జనాలు.. ‘సన్ ఆఫ్ ఇండియా’ రిలీజ్ టైంలో వారి పట్ల తమ వ్యతిరేకతనంతా చూపించేశారు. ఈ సినిమా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థియేటరుకెళ్లి సినిమా చూడలేదు కానీ.. సోషల్ మీడియాలో బుకింగ్స్, కలెక్షన్ల గురించి కామెడీ చేయడానికి మాత్రం తెలుగు ప్రేక్షకులు బాగా పోటీ పడ్డారు.
పిల్లలు పెంచుతారనుకుంటే..
పిల్లలు పెంచుతారనుకుంటే..
ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ టాలీవుడ్ నిన్నటి తరం సూపర్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ఏఎన్నార్ లెగసీని నాగార్జున కూడా బాగానే కాపాడాడు. ఆయన పెద్ద కొడుకు కెరీర్ ఆరంభంలో కొంచెం తడబడ్డా ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోగా స్థిరపడ్డాడు. అఖిల్ నిలదొక్కకునే ప్రయత్నంలో ఉన్నాడు. నిర్మాత కొడుకైనప్పటికీ వెంకటేష్ పెద్ద స్టార్ అయ్యాడు. దగ్గుబాటి కుటుంబంలో మూడో తరానికి చెందిన రానా విలక్షణ పాత్రలతో మంచి ఇమేజ్ సంపాదించాడు.
కృష్ణ కొడుకు మహేష్ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. తండ్రి నుంచి సూపర్ స్టార్ ట్యాగ్‌ను కూడా అందుకునే అరÛత పొందాడు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగాడో తెలిసిందే. హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్లలో ఒకడయ్యాడు. చిరంజీవి సపోర్ట్‌తో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
మెగా ఫ్యామిలీ నుంచే వచ్చిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా తామేంటో రుజువు చేసుకున్నారు. ఇక ప్రభాస్ గురించి చెప్పేదేముంది? కృష్ణంరాజు మరీ పెద్ద స్టార్ కాకపోయినా, ప్రభాస్ ఆయన అన్న కొడుకు అయినా.. ఈ బ్యాగ్రౌండ్‌తో వచ్చి ఇండియాలోనే అతి పెద్ద స్టార్‌గా అవతరించాడు. ఇదీ టాలీవుడ్లో వారసుల ప్రస్థానం. కానీ వీళ్లలో ఎవరితోనూ పోల్చలేని దయనీయ పరిస్థితి మంచు వారసులది. ముందుగా మంచు విష్ణు హీరో అయ్యాడు.
ఆ తర్వాత మంచు మనోజ్ వచ్చాడు. ఆపై మంచు లక్ష్మి రంగ ప్రవేశం చేసింది. మామూలుగా హీరోల కెరీర్లలో హిట్ల మధ్య ఫ్లాపులు ఎన్ని వచ్చాయి అని చూస్తారు. కానీ మంచు వారసులది దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి. డిజాస్టర్ల మధ్య హిట్ల కోసం వెతుక్కోవాలి. రెండు దశాబ్దాల విష్ణు కెరీర్లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా.. ఇవి మిహాయిస్తే హిట్లన్నవే లేవు. మంచు మనోజ్ కెరీర్లో బిందాస్, పోటుగాడు, కరెంట్ తీగ లాంటి యావరేజ్ సినిమాలే తప్ప పెద్ద హిట్ ఒక్కటీ లేదు. ఇక మంచు లక్ష్మి గురించైతే చెప్పాల్సిన పని లేదు.
ఆమె కెరీర్లో పర్వాలేదు అని చెప్పుకోదగ్గ సినిమా కూడా ఒక్కటీ లేదు. గతంలో అయినా మంచు వారసుల సినిమాలకు కాస్తో కూస్తో క్రేజ్, ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా ఆవిరైపోయాయి. వీళ్ల సినిమాలను థియేటర్లలో ఆడిస్తే మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. విష్ణు చివరి సినిమా ఓటర్, లక్ష్మి ఆఖరి చిత్రం వైఫ్ ఆఫ్ రామ్, మనోజ్ లాస్ట్ మూవీ ‘ఒక్కడున్నాడు’.. వీటి పరిస్థితి ఇదే. తన పిల్లలు వచ్చి తన ఘన వారసత్వాన్ని కొనసాగిస్తారని, తన ఇమేజ్ను పెంచుతారని మోహన్ బాబు ఆశిస్తే.. కథ రివర్స్ అయింది. ఆయన ఇమేజ్ను, మార్కెట్‌ను దెబ్బ తీసి మొత్తంగా మంచు ఫ్యామిలీని ‘జీరో’ను చేసేశారు.