భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. విశాఖలో దాదాపు 10,742 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి తర్వాత మరోసారి విశాఖలో ప్రజలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని మోడీ అన్నారు.
భారత్ కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరమని, విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనదని మోడీ చెప్పారు. 1000 ఏళ్ల క్రితమే విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేదని, ఈనాటికి కూడా విశాఖ దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఒకటని మోడీ కితాబిచ్చారు. నేడు తాను ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో విశాఖతో పాటు ఆంధ్రా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు మంచివారని, స్నేహ స్వభావం కలిగిన వారిని ఆయన అన్నారు.
ఏపీ శ్రేయస్సు, ప్రయోజనాల గురించే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనతో ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష ఉన్నతమైనదని, మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ తపన పడుతుంటారని ప్రశంసించారు. విశాఖలో చేపల రేవును ఆధునీకరిస్తున్నామని, దేశాల్లోని రవాణా వ్యవస్థలో పలు మార్పులు వచ్చాయని మోడీ అన్నారు.
రైల్వే స్టేషన్లు, పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని, సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత వైపు చూస్తుందని మోడీ గర్వంగా చెప్పారు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటామని మోడీ చెప్పారు.