సమకాలీన భారతంలో చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ.. వారందరికి చాలా భిన్నం నరేంద్ర మోడీ. ఆయన మాటలు.. చేతలు అన్ని రోటీన్ కు భిన్నమని చెప్పాలి. పేదోడి కోసం తపించే ఆయన మనసు.. తన ఒంటికి మాత్రం ఖరీదైన దుస్తుల్ని వరుస పెట్టి ధరించటమే కాదు.. సగటు సెలబ్రిటీ సైతం ఆయన మాదిరి మొయింటైన్ చేయటం సాధ్యం కాదని చెప్పాలి.
నరేంద్ర మోడీకి వీర విధేయులు కోట్లాది మంది ఉన్నారు. ఆయనతోనే దేశ రూపు రేఖలు మారిపోతాయని బలంగా నమ్మే వారికి కొదవ లేదు. ప్రదానమంత్రిగా పదవిని చేపట్టి దగ్గర దగ్గర ఎనిమిదేళ్లు (మరో రెండు నెలల్లో) కావొస్తున్నా.. ఆయన ఇమేజ్ కించిత్ కూడా డ్యామేజ్ కాలేదు సరికదా.. రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతుందని వాదించేవారు బోలెడంత మంది కనిపిస్తారు.
నరేంద్ర మోడీ జీవితంలో బయటకు రాని అంశాలు.. ఇప్పటివరకు వెలుగు చూడని విశేషాలను అందరికి తెలియజేయాలన్న లక్ష్యంతో తాజాగా ఒక వెబ్ సైట్ ను సిద్ధం చేశారు. దానికి ‘మోడీ స్టోరీ’ (MODI STORY) పేరుతో ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీనితో మోడీ జీవితంలో చోటు చేసుకున్న చాలా విశేషాల్ని పేర్కొన్నారు. వీటిల్లో చెప్పిన చాలా అంశాలు చాలావరకు ఎవరికి తెలియనివి కావటమే విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ వెబ్ సైట్ ను తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ మనమరాలు సుమిత్రా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం కావటం.
ఈ వెబ్ సైట్ లో మోడీ గొప్పతనాన్ని కీర్తించేలా ఉండటమే కాదు.. ఆయన జీవితంలో తనకు ఎదురైన ఎన్నో అనుభవాల్ని పేర్కొన్నారు. అదే సమయంలో వివిద రంగాలకు చెందిన ప్రముఖులు మోడీతో తమకున్న అనుబంధం గురించి పేర్కొన్నారు.
విద్యార్థిగా సైనిక దళాలపై ఆయన అభిప్రాయాలు.. దేశానికి ఎలా సేవ చేయాలి? ఎన్నికల ప్రచారంలో మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయి? తొంభై దశకంలో మోడీకి ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి.. మోడీ చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్ రాస్ బిహారీ మణియార్.. లాంటి వారితో పాటు పుల్లెల గోపీచంద్.. ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా లాంటి ఎందరో తమ అభిప్రాయాల్ని.. అనుభవాల్ని ఇందులో పేర్కొన్నారు.
ఈ సైట్ ను చదివినంతనే మోడీ మీద మరింత అభిమానం పెరగటమే కాదు.. మరింత వీర విధేయులుగా మారిపోయే అకాశం ఎక్కువగా ఉందనే చెప్పాలి. మనసుల్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ సైట్ లో పేర్కొన్న పలు ఉదంతాల్లో ఒక దాని గురించి చెబుతాం. అది చదివితే విషయం మీకు ఇట్టే అర్థమైపోతుంది.
మోడీ జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనలు.. బయటకు రివీల్ కాని వాటిని ఫోకస్ చేశారు. గుజరాత్ కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి నరేంద్ర మోడీతో 1980లలో ప్రయాణించారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఆయన చెప్పుకొచ్చారు.
మోడీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇలాంటి వేళ డాక్టర్ అనిల్ రావల్ మోడీని కలిశారు. రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మోడీని ఆయన ఒక ప్రశ్న వేశారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసం ఎలా కట్టుబడి ఉంటారు? అని అడిగినప్పుడు మోడీ బదులిస్తూ.. ‘‘ఒకసారి సంఘ్ సేవక్ గా ఒక మురికివాడకు వెళ్లాను.
ఆ ఇంట్లో స్వయంసేవక్.. ఆయన సతీమణి.. పిల్లాడితో కలిసి జీవిస్తున్నారు. నేను వారింటికి వెళ్లగానే.. నాకు పళ్లెంలో సగం రొట్టె.. ఒక గ్లాసులో పాలు ఇచ్చారు. నా గ్లాసు వంక పిల్లాడు చాలా ఆశగా చూస్తున్నాడు. ఆ పాలు ఆ పిల్లాడి కోసం ఉంచినవి.. నా కోసం ఇచ్చారని అర్థమైంది. సగం రొట్టెను తిని.. పాలు తిరిగి ఇచ్చేశారు.
ఆమె ఆ పాల గ్లాసును పిల్లాడికి ఇవ్వటం.. వాడు గడగడా తాగేశాడు. అది చూసిన నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా జీవితాన్ని అంకితం చేయాలని’.. ఇదే విధంగా పలు ఆసక్తికర అంశాలతో సిద్ధం చేసిన దీన్ని చూస్తే.. మోడీ ఇమేజ్ ను మరింత విస్తరించటమే లక్ష్యమన్న భావన కలుగక మానదు.