ఏపీలో మద్యం షాపుల టెండర్ల దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులకు మరింత గడువు కావాలని విజ్నప్తులు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆన్ లైన్, ఆఫ్ లైన్లో షాపుల కోసం ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 14న లాటరీ తీసి ఈ నెల 16 నాటికి కొత్త వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. అయితే, ప్రైవేటు మద్యం షాపుల టెండర్లను సొంతం చేసుకునేందుకు సిండికేట్లుగా కొందరు ఏర్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా వాళ్లు టెండర్లు వేయకుండా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆ విమర్శలపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా షాపుల కేటాయింపు జరగాలని రవీంద్ర అన్నారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపు, లాటరీ అంతా పారదర్శకంగా జరగాలని సూచించారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. మద్యం దుకాణాల దరఖాస్తుదారులకు అధికారులు సహకరించాలని ఆదేశించారు. అక్టోబరు 9వ తేదీ సాయంత్రానికి రాష్ట్రంలోని మద్యం షాపులకు 50 వేల ధరఖాస్తులు వచ్చాయి.
బుధవారం రాత్రి వరకు మొత్తం 57,709 దరఖాస్తులు రాగా.. ఫీజు రూపంలో రూ. 1154. 18 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవాళ, రేపు కూడా దరఖాస్తులకు అవకాశం ఉంది. దీంతో మరో 40వేల వరకు దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 7 గంటల వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దీంతో, గడువు ముగిసే లోపు మొత్తం 80 వేల దరఖాస్తులు, 1600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది.