మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని జగన్ తన పాలనతో అతలాకుతలం చేసేశారు. పీపీఏలను రద్దు చేయడం, సోలార్, విండో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం ఏపీ విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎదురు దెబ్బలు. దీనికి తోడు వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. కానీ అధికారం కోల్పోగానే కూటమి ప్రభుత్వమే ఛార్జీలను పెంచేసిందంటూ వైసీపీ ధర్నాలు చేయడం షురూ చేసింది.
అయితే ఈ విషయంపైనే తాజాగా మంత్రి డోలా బాల స్పందించారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నా చేయించడం జగన్ సైకో చర్య అంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీ జెన్ కో నుంచి ప్రభుత్వానికి విద్యుత్ యూనిట్ రూ.5కే వస్తుంది. కానీ, బహిరంగ మార్కెట్ లో తన వాళ్లకు మేలు చేయడం కోసం జగన్ రూ. 8 నుంచి రూ. 14 వరకు ఖర్చు చేసి కొనుగోలు చేశారంటూ డోలా బాల ఆరోపణలు చేశారు.
విద్యుత్ కొనుగోళ్లకు ఏపీఈఆర్సీ అనుమతించిన దాని కన్నా రూ. 19వేల కోట్లు అదనంగా వెచ్చించడం నిజం కాదా? అని జగన్ ను ప్రశ్నించారు. ఆనాడు ప్రజలపై విద్యుత్ భారాలు మోపి.. నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు చేయడం సిగ్గుచేటన్నారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. ఆనాడు పవర్ ఛార్జీలు పెంచినందుకే.. ప్రజలు జగన్ పవర్ పీకేశారని మంత్రి డోలా సెటైర్స్ పేల్చారు.