ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని అమరావతినే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజధాని నిర్మాణం మళ్లీ పట్టాలెక్కింది. మరో మూడేళ్లలో అమరావతి ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అలాగే మరోవైపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
ఇక ఈ నేపథ్యంలోనే వైష్ణవి అనే మెడికల్ స్టూడెంట్ ఏపీ రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ విరాళాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన అంబుల వైష్ణవి విజయవాడలో ఒక మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. అయితే రాజధాని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో పని చేస్తున్న ప్రభుత్వానికి వైష్ణవి తన వంతు సహకారాన్ని అందించాలని భావించింది.
అందులో భాగంగానే తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా అమ్మగా వచ్చిన రూ. 25 లక్షలను అమరావతి.. అలాగే తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన లక్ష రూపాయిలను పోలవరానికి విరాళంగా ఇచ్చింది. శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని తన తండ్రి మనజ్ తో వెళ్లి కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేసింది.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న వైష్ణవి మరియు ఆమెకు సహకరించిన తండ్రి మనోజ్ ను చంద్రబాబు అభినందించారు. శాలువా కప్పి వైష్ణవిని సత్కరించడమే కాకుండా ఆమెకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.