లీవుడ్ బడా ఫ్యామిలీస్‌లో మంచు కుటుంబం ఒకటి. కానీ మోహన్ బాబు ఘన వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన పిల్లలు విఫలమయ్యారు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. కెరీర్ సక్సెస్ రేట్ మరీ దారుణం. అందులోనూ గత కొన్నేళ్లలో అయితే అతడి మార్కెట్ దారుణంగా పడిపోయి.. దాదాపు జీరో అయిపోయింది.
విష్ణు చివరి సినిమా ‘ఓటర్’ రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియదు. అంతకుముందు ‘ఆచారి అమెరికా యాత్ర’ పరిస్థితి కూడా దీనికి భిన్నమేమీ కాదు. దీంతో కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ తీసుకున్నాడు విష్ణు. శ్రీను వైట్లతో ‘ఢీ’ సీక్వెల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలనుకుని వెనక్కి తగ్గిన విష్ణు.. ఇషాన్ సూర్య అనే కొత్త దర్శకుడితో ‘జిన్నా’ అనే సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఫస్ట్ లుక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాన్ని కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దారు.
‘జిన్నా’ ఫస్ట్ లుక్కు ముందు ప్రిపరేషన్‌ను ఒక వీడియో రూపంలో అందించింది చిత్ర బృందం. షాట్ రెడీ చేసుకుని దర్శకుడు సూర్య, కెమెరామన్ ఛోటా కే నాయుడు మంచు విష్ణును పిలవడం.. అతడి నుంచి స్పందన లేకపోవడం.. తర్వాత స్టంట్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ రంగంలోకి దిగి జిన్నా పేరుతో విష్ణును పిలిపిస్తే.. వెంటనే అతను రంగంలోకి దూకడం.. ఇలా ఒక కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు.
విష్ణు ‘జిన్నా’ పాత్రలో ఎలా లీనమైపోయి ఉన్నాడో ఈ టీజర్ ద్వారా చూపించారు. ఐతే వీడియోలో విష్ణుకు ఇచ్చిన బిల్డప్ అదీ కొంచెం అతిగానే అనిపించింది. ఐతే వరుస ఫ్లాపుల్లో సతమతం అవుతున్న హీరోలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతుంటాయి. ఆ ప్రభావం చేసే సినిమాల మీదా కనిపిస్తుంటుంది.
బిల్డప్‌లు తగ్గించుకుంటూ ఉంటారు. కానీ విష్ణుకు ఫ్లాపులు కొత్త కాదు. తన మార్కెట్ ఎంత దెబ్బ తిన్నా.. తన గురించి ఎవరేమనుకున్నా.. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా.. తగ్గే రకం కాదు ఈ మంచు హీరో. కాబట్టే ‘జిన్నా’ ఫస్ట్ లుక్ టీజర్లో తనకు తాను అంత బిల్డప్ ఇచ్చుకున్నాడు విష్ణు.