తన తండ్రి మోహన్ బాబుతో ఆస్తి వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు నుంచి తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్..ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు న్యాయం చేయాలని కోరడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు మరోసారి మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తాను పోరాడడం లేదని…ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్ ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు.
తన భార్యాబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే బౌన్సర్లను తెచ్చుకున్నానని మనోజ్ వివరణనిచ్చారు. అయితే, తన బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించమని పోలీసులను కోరానని, కానీ, తన అనుచరులను పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, న్యాయం కోసం అందరినీ కలుస్తాననని చెప్పారు.
విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని, అందులో ఏం నిజం దాచాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంట్లో ఏం జరిగింది అన్న విషయంపై అన్ని వివరాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మనోజ్ అన్నారు. శ్రీవిద్యానికేతన్ లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, అవి తాను బయటపెట్టినందుకే తనపై ఈ రకంగా కక్ష సాధిస్తున్నారని మనోజ్ ఆరోపించారు.
అయితే, జల్పల్లిలోని మంచుటౌన్ షిప్లో పదేళ్లుగా నివాసముంటున్నాని, కానీ, మనో జ్, మౌనికలు తన అనుచరులతో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. 7 నెలల కూతురిని వదిలేసి మనోజ్,మౌనిక బయటకు వెళ్లిపోతార ని, ఆ పాపకు ఇంట్లో పనిచేసే మహిళే సంరక్షకురాలిగా ఉంటుందని వెల్లడించారు. 30 మంది మనోజ్ అనుచరులు ఇంట్లో వారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలని భయపెట్టారని అన్నారు. తన ఆస్తులను కాజేసేందు కు మనోజ్ కుట్ర పన్నారని, తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.