తెలంగాణలో టిఆర్ఎస్ నేతలు, వారి బంధువుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ సోదాల వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డిపై కూడా ఐటి అధికారులు సోదాలు జరిపారు. అయితే ఐటి అధికారులు తన కొడుకును రైడ్స్ పేరుతో వేధించారని, వారు తన కొడుకుని కొట్టారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.
రాత్రంతా సిఆర్పిఎఫ్ బలగాలతో మహేందర్ రెడ్డిని కొట్టించారని, ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఛాతీపై దెబ్బలు తగిలి ఛాతీ నొప్పి వచ్చిందని ఆరోపించారు. తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని, కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని మల్లారెడ్డి అన్నారు. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని, కష్టపడి సంపాదించి నిజాయితీగా బతుకుతున్నామని అన్నారు. కేంద్ర వ్యవస్థలను వాడుకొని బిజెపి అక్రమంగా దాడులు చేయించిందని ఆరోపించారు.
ఛాతి నొప్పితో అస్వస్థతకు గురైన మహేందర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన కొడుకుని చూసేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చింది మల్లారెడ్డిని ఐటి అధికారులు అడ్డుకున్నారు. దీంతో, వారి తీరుకు నిరసనగా ఆస్పత్రి ముందే మల్లారెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు.