ఈశా యోగా కేంద్ర నిర్వాహకుడు కం ప్రముఖ యోగా గురువుగా పేరున్న జగ్గీ వాసుదేవ్ కు సంబంధించి మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొత్త చర్చకు తెర తీశాయి. యోగా నేర్చుకోవటం కోసం ఈశా ఫౌండేషన్ కు వెళ్లిన తమ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు అక్కడే ఉంటున్నారని.. ఇంటికి రాలేమని చెప్పటంతో పాటు.. ఇంటికి రావాలని బలవంతం చేస్తే చనిపోయే వరకు తాము నిరాహారదీక్ష చేస్తామని చెబుతున్నట్లుగా ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఇద్దరు అమ్మాయిల్ని హైకోర్టు ఎదుట హాజరుపర్చారు. కోయంబత్తూరు వ్యవసాయ వర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ ఇద్దరు కుమార్తెలు గీత.. లతలు ఈశా యోగా కేంద్రానికి యోగా నేర్చుకోవటానికి వెళ్లి.. అక్కడే ఉండిపోయారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేయగా.. మద్రాసు హైకోర్టు స్పందించింది. కోయంబత్తూరు న్యాయమూర్తిని పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సమయంలో తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేయొద్దని పేర్కొంటూ పిటిషనర్ కుమార్తెలు సివిల్ కేసు వేశారు. దీంతో మానసికంగా తన భార్య తీవ్ర ప్రభావానికి గురైనట్లుగా పేర్కొన్నారు. తమ కుమార్తెల్ని గదిలోనిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోందన్న ఆయన మాటలకు.. ఆయన ఇద్దరు కుమార్తెలు స్పందించారు. ఈశా యోగా కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయకూడదని.. అలా చేస్తే చనిపోయే వరకు నిరాహారదీక్ష చేపడతుందని తన రెండో కుమార్తె తెలిపినట్లుగా కోర్టుకు విన్నవించుకున్నారు.
ఈశా కేంద్రం నుంచి బయటకు వస్తే వారిని ఇబ్బంది పెట్టమని..వారి ప్రైవసీని కాపాడతామని తమ కుమార్తెలను తమకు అప్పగించాలని సదరు రిటైర్డు ప్రొఫెసర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తాజాగా జస్టిస్ సుబ్రమణియన్.. జస్టిస్ శివజ్ఞానం ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలను కోర్టు ఎదుట హాజరుపర్చారు. వారిద్దరిని కోర్టు విచారించింది.
జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు పెళ్లి చేసిన ఫోటోను చూసిన కోర్టు.. ఇతరుల పిల్లలను ఎందుకు సన్యాసినులుగా మార్చాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఈ కేసులో తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. ఎవరికీ అనుకూలంగా లేమని తెలిపిన న్యాయమూర్తులు.. ఈ అంశంలో పలు అనుమానాలుఉన్నాయని పేర్కొన్నారు. ఈశా యోగా కేంద్రంపై ఇప్పటివరకు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి? వాటి వివరాలు దాఖలు చేయాలి? అంటూ పోలీసులకు ఉత్వర్లులు జారీ చేశారు.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో కోవై జిల్లా ఎస్పీ కార్తికేయన్.. ఇతర అధికారుల టీం ఈశా కేంద్రంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు యోగా కేంద్రంలో బస చేసిన వారి వివరాలు.. అందులో మహిళలు.. ఫారినర్లు ఎంత మంది ఉన్నారు? కనిపించకుండా పోయిన వారు? చనిపోయిన వారికి సంబంధించిన వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. జగ్గీ వాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.