టీడీపీ అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలని చూసినా మొక్కవోని దీక్షతో లోకేష్ తన పాదయాత్రను కొనసాగిస్తూ యువగళాన్ని రాష్ట్రం నలువైపులా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంగా లోకేష్ రాయలసీమపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా కడపలో న్యాయవాదులతో ముఖాముఖి భేటీ నిర్వహించిన లోకేష్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాదు మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత లాయర్లకు హెల్త్ కార్డులు, నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని కూడా లోకేష్ అన్నారు.
న్యాయవాదులకు కూడా నామినేటెడ్ పదవులు ఇస్తామని లోకేష్ వెల్లడించారు. ఇక, రాజకీయ లబ్ధి కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో న్యాయవాదులు కూడా ఆయన బాధితులేనని, న్యాయవాదులకు ఇచ్చిన హామీలలో ఒక్క దానిని కూడా జగన్ నెరవేర్చలేదని లోకేష్ మండిపడ్డారు.
జగన్ ఒక ఉగ్రవాది అని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలనను మొదలుపెట్టిన జగన్ ఆ విధ్వంసకర పాలనను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.