గతంలో సెలబ్రిటీలు.. సినీ ప్రముఖులకు ఎప్పుడూ లేని కొత్త తలనొప్పులు టెక్నాలజీ తీసుకొస్తోంది. గతంలో ఒక ప్రముఖుడ్ని కలవాలన్నా.. వారిని తన మాటలతో.. చేతలతో ఇంప్రెస్ చేయాలన్నా.. భయపెట్టాలన్నా.. టెన్షన్ పుట్టించాలన్నా కేవలం ఒక మెసేజ్ సరిపోయే పరిస్థితి. అలాంటి ప్లాట్ ఫాంలు ఎన్నో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. సోషల్ మీడియాతో లాభంతో పాటు.. ఇబ్బందులు కూడా ఎన్నో ఉన్నాయి. తాజా ఉదంతం గురించి తెలిస్తే.. ప్రముఖులకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. నటి సనమ్ శెట్టి సంచలన విషయాన్ని తాజాగా షేర్ చేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తి ఒకరు.. ఇటీవల కాలంలో ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడట. ఆమెను.. ఆమె కుటుంబాన్ని లేపేస్తామంటూ వార్నింగ్ లు ఇవ్వటమే కాదు.. ఏకంగా తన వ్యక్తిగత ఫోన్ నెంబరు షేర్ చేసి మరీ బెదిరిస్తున్న వైనాన్ని ఆమె వెల్లడించారు. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని సోషల్ మీడియాలో ఒక పోస్టు రూపంలో వెల్లడించటమే కాదు.. ఇలాంటి పరిస్థితుల్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని తన అనుభవాన్ని జోడించి మరీ చెప్పుకున్నారు.
తన ఇన్ స్టా.. ట్విటర్ అకౌంట్లో వచ్చే కొన్ని మెసేజ్ ల గురించి పేర్కొంది. కొద్ది నెలలుగా దారుణమైన మెసేజ్ లు వస్తున్నట్లు వెల్లడించింది. వాటిని తాను పెద్దగా పట్టించుకోలేదంది. ‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చంపుతామని ఒక వ్యక్తి నా ఫోన్ నెంబరుకు బెదిరింపు మెసేజ్ పంపాడు. అతడి వ్యవహారం చూస్తుంటే.. నా వ్యక్తిగత విషయాల్ని కూడా సేకరించినట్లుగా అనిపించింది’’ అని చెబుతూ.. అందుకే తాను పోలీసుల్ని సంప్రదించినట్లు చెప్పింది. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే దాన్ని లైట్ తీసుకోవద్దని.. బయటకు చెప్పాలని చెప్పిన ఆమె.. తన విషయానికి సంబంధించి ఏం జరిగిందన్న విషయాన్ని వివరంగా వెల్లడించింది.
తన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. ఆ గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని.. చంపేస్తామన్న బెదిరింపు మెసేజ్ లకు కారణం ఏమిటన్న విషయాన్ని విచారిస్తున్నట్లుగా చెప్పింది. ఏ ఉద్దేశంతో అతడీ పని చేశాడు? అతడి వెనుకా ఇంకెవరైనా ఉన్నారా? లాంటి అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారని చెప్పింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులకు ఆమె స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ‘ఇలాంటివి దాచి పెట్టుకోవద్దు. షేర్ చేయండి. నలుగురికి సాయం చేయండి’ అంటూ ఆమె చెబుతున్న మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు.