కర్ణాటక సీఎం యడియూరప్పకు పదవీ గండం తప్పదని, ఈ నెల 26న యడ్డీని సాగనంపేందుకు బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయిందని కన్నడనాట జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. యడ్డీ కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు బీజేపీ పెద్దల నుంచి హామీ వచ్చిందని, అందుకే యడ్డీ కూడా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, యడ్డీ రాజీనామాకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని బీజేపీ కీలక నేత ఒకరు మాట్లాడినట్టున్న ఆడియో క్లిప్ వైరల్ అయింది.
అంతకుముందు, ఢిల్లీలో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న యడ్డీ…తన వెంట 6 సూట్ కేసులు తీసుకువెళ్లారన్న పుకారు పెనుదుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆ సూట్ కేసుల వ్యవహారంపై మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో యడియూరప్ప భేటీ ఎన్నో సందేహాలను కలిగించిందని, మోదీతో భేటీ సమయంలో యడియూరప్ప ఆరు బ్యాగులు తీసుకెళ్లారని, ఆ బ్యాగుల్లో ఏమున్నాయ్?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఆ 6 బ్యాగుల్లో ‘కానుక’లున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ బ్యాగులన్నింటినీ మోదీకి యడియూరప్ప కానుకగా ఇచ్చారా? అని కుమార స్వామి సందేహం వ్యక్తం చేశారు. ఆ బ్యాగుల్లో కర్ణాటక ప్రజాసమస్యలకు సంబంధించిన పత్రాలున్నాయా? లేదంటే మరేమైనా ఉన్నాయా? చెప్పాలని యడ్డీని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివని అన్నారు.