తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సందర్భంగా ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షాను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షాను ఈ అన్నాచెల్లెళ్లు ఆడుకుంటున్న వైనం ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ పర్యటన నేపథ్యంలో అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ 27 ప్రశ్నలను సంధించారు. తమ రాష్ట్రంపై బీజేపీ ఎనిమిదేళ్లుగా వివక్ష కొనసాగిస్తోందని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. స్పీచులి చ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటైందని ఎద్దేవా చేశఆరు. తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐసర్,ఏన్ఐడీ, ట్రిపుల్ఐటీ, గిరిజన వర్సిటీ, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా కేటాయించలేదని విమర్శించారు.
తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్‌షా అడుగు పెడుతున్న వేళ విభజన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడం, వాటి కోసం తెగేదాకా కొట్లాడటం తమ బాధ్యత అని కేటీఆర్ అన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, షాపై కవిత ట్వీట్లతో విమర్శలు గుప్పించారు.
‘‘అమిత్ షా జీ, రూ.3 వేలకు కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీరేమని సమాధానం చెబుతారు? నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏమంటారు?’’ అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247 కోట్ల సంగతి ఏం చేశారని ప్రశ్నించిన కవిత.. అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్పీజీని విక్రయించడంలో భారత్‌ను అగ్రగామి దేశంగా మార్చడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలను ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో నేడు ప్రజలను కలిసినప్పుడు చెప్పాలని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోలేదో కూడా తెలంగాణ బిడ్డలకు వివరించి చెప్పాలని కోరారు. కర్ణాటకలోని ఎగు భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు నిరాకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.