ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు రెండు రోజులు కావస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలోని ఆయా పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరోజు ఆలస్యంగా నిద్ర లేచినట్లున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి ఈ అంశంపై తీరిగ్గా స్పందించారు. అది కూడా ఆ రాష్ట్ర ఫలితాలపై మాట్లాడడానికి కాదు.. సొంత పార్టీ అధ్యక్షుడిని దునుమాడడానికి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత ఆలస్యం చేశావని వెక్కిరింపు ధోరణిలో విమర్శిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ మారదు కాక మారదు. గ్రూపు గొడవలు లేకుండా.. సొంత పార్టీ నాయకులను విమర్శించకుండా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు ఆ పార్టీ. ఇదే కదా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీసింది. ఇదే కదా ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దిగజారుతూ రావడానికి కారణం. ఇదే కదా పంజాబ్ లో అధికారాన్ని ఆప్ పార్టీకి పువ్వుల్లో పెట్టి ఇచ్చింది. ఇదే కదా తమకు పట్టున్న గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో చతికిలపడింది. అయినా ఆ పార్టీ నేతల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. పక్కవాడి ఎదుగుదలను అస్సలు ఓర్చుకోవడం లేదు.
తాజాగా కోమటి రెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల రెడ్డి మళ్లీ మొదలెట్టాడు. దొరికిందే అవకాశమని రేవంత్ పై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కారు. కాకుంటే ఒకరోజు ఆలస్యమైంది అంతే. ఎక్కడో పంజాబ్ లో కాంగ్రెస్ ఓడితే.. తెలంగాణలో అధ్యక్షుడిని మార్చాలట. ఇప్పటికైనా మించిపోయింది లేదని రేవంత్ ను దింపేసి తన అన్న కోమటి రెడ్డి వెంకటి రెడ్డికి పీఠం అప్పగించాలట.
ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తప్పు పట్టారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి.. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ కట్టబెట్టి తప్పుడు ప్రయోగం చేసిందన్నారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యే స్థాయీ వ్యక్తులను కూడా నియమించడం చేతకావడం లేదని రేవంత్ ను దెప్పిపొడిచారు. పనిలో పనిగా పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ పై కూడా నిందలు వేశారు. దీంతో పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యాఖ్యానించడం ఆయనకే చెల్లిందని కారాలు మిరియాలు నూరుతున్నారు.
రాజగోపాల రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీతో టచ్ లో ఉంటున్నారని.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకునే ఇలా ప్రవర్తిస్తున్నారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే హీరో అయిపోవచ్చని భావిస్తున్నారని.. కానీ రేవంత్ ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఇలా కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆయనపై విమర్శలు ఆగడం లేదు. సొంత పార్టీ నేతలకే టార్గెట్ అయ్యారు. కోమటి రెడ్డి నుంచి మొదలుకొని ఆయన తమ్ముడి వరకు అందరికీ విలన్ అయ్యారు. కోమటి రెడ్డి బ్రదర్స్, వీహెచ్, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ ఇలా ఒకరొకరుగా బయటకు వస్తున్నారు. కానీ ఆరోజు అధిష్ఠానం కనుక రేవంత్ కు ఇవ్వకపోయి ఉంటే ఈపాటికి కాంగ్రెస్ ఖాళీ అయ్యేదని.. రేవంతును చూసే చాలా మంది ఆగిపోయారనే విషయాన్ని ఈ సీనియర్లు గుర్తించడం లేదని మరో వర్గం వాదిస్తోంది. రేవంత్ వీటన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళతారో వేచి చూడాలి.