గతంలో రాజకీయ పార్టీలకు, మీడియాకు మధ్య ఓ సన్నని గీత ఉండేది. ఆ గీత దాటకుండా రాజకీయ నేతలు, మీడియా యాజమాన్యాలు ఎవరి పని వారు చేసుకునేవి. కానీ, ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆ గీత చెరిగిపోయింది. వ్యక్తిగత కక్షలను మీడియా సంస్థలపై రుద్దడం, మీడియాకు కులం రంగు ఆపాదించడం వంటివి పరిపాటిగా మారాయి. అలా వైఎస్ మొదలుబెట్టిన ట్రెండ్ ను తాజాగా కొడాలి నాని కొనసాగిస్తు సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ, టీవీ 5లను బ్యాన్ చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని ప్రకటించారు. అంతేకాదు, వైసీపీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు ఆ చానెళ్లను, పత్రికలను పిలవద్దని, వాటికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని హుకుం జారీ చేశారు. అయితే, ఇలా చేయడం వల్ల అటు ప్రభుత్వానికే నష్టంగానీ… ఆ మీడియా సంస్థలకు పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ, ఇలా బహిరంగంగా బ్యాన్ అంటూ చెప్పడం వల్ల ప్రభుత్వానికి డ్యామేజీ జరిగే చాన్సుంది.
రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన ట్రెండ్ ను 2014 ఎన్నికల్లో టీడీపీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక, తాజాగా దానిని కొడాలి నాని కంటిన్యూ చేయడం చర్చనీయాంశమైంది. ఇక, ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కూడా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లను జగన్ బ్యాన్ చేసుకున్నారు. తన మీడియా సమావేశాలకు రావొద్దంటూ బాహాటంగానే చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మరి, ఈ బ్యాన్ ల వ్యవహారం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాలి.