కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు ఎంత విజయవంతం అయ్యాయో అందరికీ తెలిసిందే. బంగారు గనులు కేంద్రంగా సాగిన ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు రేపాయి. అయితే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేజీఎఫ్ 3 అంటూ కొత్త అర్ధం చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎన్నికల ప్రచారంలో కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్ అని తీవ్ర విమర్శలు చేశారు.
సర్వేపల్లి నుండి ఇప్పటికి రెండు సార్లు గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా కొనసాగుతూ మూడో సారి బరిలోకి దిగారు. గతంలో ఇక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి టీడీపీ నుండి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో సోమిరెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
‘‘కాకాణి గోవర్ధన్ రెడ్ది క్వార్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలతో కేజీఎఫ్ ను సృష్టించుకున్నాడని, అవినీతి మంత్రిని అదే గోతులలో పూడుస్తామని, ఆయన దోచిన సహజ వనరులే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయని’’ చంద్రబాబు నాయుడు అన్నారు. కేజీఎఫ్ ను ఉదహారిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సర్వేపల్లి రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.