ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫొటో ముద్రించి ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అదే తరహాలో మన దేశంలో కూడా కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫొటోతోపాటు లక్ష్మీదేవి ఫొటోను ముద్రించాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుతున్నారు.
ఈ డిమాండ్ విన్న వెంటనే ఆ సీఎం కచ్చితంగా బీజేపీకి చెందినవాడని అనుకుంటే పొరబడినట్లే.
ఎందుకంటే, ఆ డిమాండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై ఆ ఫొటోలను ముద్రించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరొక వైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించవచ్చని క్రేజీ సలహా ఇచ్చారు కేజ్రీవాల్.
ఇండోనేషియా తరహాలో ఇండియాలో కూడా కరెన్సీపై దేవతలు, దేవుళ్ల బొమ్మలు ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
అలా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
అలా ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదని, అటువంటి సమయాల్లో దైవానుగ్రహం తోడైతే ఫలితం దక్కుతుందని కేజ్రీవాల్ ఆధ్యాత్మిక ధోరణిలో చెప్పడం విశేషం.
ఈ ముద్రణ విషయంపై త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ కూడా రాయనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇక, ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆప్ సిద్ధమైందని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీలో సివిక్ పోల్స్ తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు.
కేజ్రీవాల్ క్రేజీ కామెంట్లు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవేనని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.