ప్రజలు ఎపుడూ తమకు జరిగే మంచికి అయినా, చెడుకు అయినా స్థానిక ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తాయి. వారు కేంద్రాన్ని నేరుగా వ్యతిరేకించడం, పగ చూపడం చాలా అరుదు.
వరి విషయంలో ఇపుడు ఇదే ముప్పు కేసీఆర్ కు పొంచి ఉంది. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేయడంతో రైతులు భారీ వరి పంట వేశారు. కానీ ఇపుడు గిట్టుబాటు ధరలేక కొనేవారు లేక వారు అప్పులపాలయ్యే పరిస్థితి వస్తోంది.
దీనికంతటికీ కారణం తనే అని కేసీఆర్ పై వారు ఆగ్రహం వ్యక్తంచేసేలోపు కేసీఆర్ కేంద్రంపైకి రైతులను ఉసిగొల్పే కొత్త ఎత్తుగడ వేశారు. కొన్ని రోజులుగా రైతుల తరఫునే రోజూ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ చేసే పనుల వల్ల రైతులకు ఒరిగేదేం లేదు. ఉత్త ఆశలు తప్ప.
తన గేమ్ లో భాగంగా కేసీఆర్ తాజాగా… కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేంద్రమంత్రులపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇక్కడి నుండి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి అన్నారని, ఆయనకు దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనిపించాలని డిమాండ్ చేశారు.
పియూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే.. కేంద్రం స్పందించలేదని తప్పుబట్టారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందన్నారు. దేశంలో నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు.
కేంద్రానికి సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం కొనాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం దుష్ట పాలనతో దేశంలో ఆకలి కేకలు పెరిగాయని, ప్రతి బోర్ దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. కేంద్రం పవర్ రిఫామ్స్ పేరుతో రాష్ట్రం మెడమీద కత్తి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడేళ్లలో బీజేపీ ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని నిలదీశారు. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారని, మత చిచ్చు పెట్టి దేశ సమగ్రతను దెబ్బతీస్తారని కేసీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీని నమ్ముకుంటే సర్వనాశనం కావ్వాల్సిందేనని అన్నారు. గత రెండేళ్లలో దేశంలో భయంకరంగా పేదరికం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని కేసీఆర్ చెప్పారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాల్లో 101వ స్థానం భారతదేశం ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే దారుణమైన స్థానంలో భారత్ ఉందని తెలిపారు. కేంద్రానికి ఇంతనన్న సిగ్గుండాలని కేసీఆర్ అన్నారు.
కేంద్రం కొనకపోతే వర్షాకాలం వరిని వెయ్యి లారీల్లో తీసుకెళ్లి ఢిల్లీలో పోస్తామని హెచ్చరించారు. వర్షాకాల ధాన్యాన్ని కిషన్‌రెడ్డి ఇంట్లో, బీజేపీ ఆఫీసులో పోస్తామని ప్రకటించారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని తేల్చిచెప్పారు.
బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. ధాన్యం ఎంత కొంటారో చెప్పకుండా బేకార్ మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వర్షాకాలం పంటను ఎంతైనా కొంటామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం రూ.10 వేల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దేశ రైతాంగాన్ని గందరగోళానికి గురిచేసిందని విమర్శించారు.
కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ధాన్యం నిల్వలు ఎక్కువైతే కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, నష్టం వస్తే కేంద్రం భరించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.