తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటా బయట వస్తున్న ఒత్తిళ్లతో ఆయన కొరడా ఝులిపించారు. దీర్ఘకాలం వస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల అధిక ఫీజు వసూళ్ల పర్వంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా వార్తల్లో నిలిచిన నగరంలోని బంజారాహిల్స్‌లో గల విరించి ఆస్పత్రి సహా మరో నాలుగు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, ఇదంతా ఇటు ప్రధాన స్రవంతి అటు సోషల్ మీడియాలో రచ్చ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయం.
కరోనా చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు మొదలుపెట్టింది. విరించి, విన్, టీఎక్స్, నీలిమ, మ్యాక్స్ హెల్త్ ఆస్పత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్‌ను వైద్యారోగ్యశాఖ రద్దు చేసింది. ఇక తాజాగా వార్తల్లో నిలిచిన విరించి హాస్పిటల్ లో కరోనా చికిత్స ను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరోనా సంక్షోభంలో గత ఏడాది సైతం భారీ ఫీజుల కారణంతో విరించి ఆస్పత్రి కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు అవడం గమనార్హం.
ఇదిలాఉండగా, ఏపీ ప్రభుత్వం కరోనా సమయంలో నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా ఝులిపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనేక ఆస్పత్రులపై జరిమానా విధించింది. ఈ వార్తలు ఇటు ప్రధాన స్రవంతి మీడియాలో అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు సైతం వచ్చాయి. దీంతో ఎట్టకేలకు అలర్ట్ అయిన ప్రభుత్వం తాజాగా ఈ చర్యలు చేపట్టిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.