సవాళ్లకు తలొగ్గే రకం కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అలా అని ఆయన ధైర్యం లేని పిరికిపంద ఏమీ కాదు. నత్తకు ఎలా అయితే తన బలం ఎంతన్న విషయం తెలుసో.. అలానే కేసీఆర్ కు ఆ విషయంలో లెక్కలు పక్కాగా ఉంటాయని చెప్పాలి. నత్త ఎప్పుడైతే తనకు అపాయం అనుకుంటుందో వెంటనే తనకు రక్షణ కవచం లోపలకు వెళ్లిపోతుంది.
అలానే అనూహ్య పరిణామాలు ఎదురైన వేళలో.. కేసీఆర్ సైతం ఇలాంటి తీరునే ప్రదర్శిస్తారని చెప్పాలి. కాకుంటే.. అందరికి దూరంగా ఉండే ఆయన.. ఆ సమయంలో తనకున్న అస్త్రశస్త్రాలు పదును పెట్టేందుకు సమయాన్ని వెచ్చిస్తారు. మరింత బలంగా తయారై వచ్చేందుకు వీలుగా మేధోమధనం జరుపుతారు.
అలాంటి మధనం జరిపిన ఆయన తాజాగా ప్రగతిభవన్ లోనూ.. ఆ తర్వాత టీఆర్ఎస్ భవన్ లోనూ నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. గతంలో మాదిరి ఆయనలో తిరుగులేని అధికారం అన్న ధీమా మాటలు కనిపించకపోవటం తాజా సమావేశాల ప్రత్యేకతగా చెప్పాలి. 2018లో అనధికారిక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు.. ఆయన నోట వినిపించిన ధీమా మాటలకు భిన్నంగా తాజా మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఆ రోజుల్లో ఎన్నికల్లో తమకు 100 సీట్లు ఖాయమన్న ఆయన.. అందుకు కాస్తంత తగ్గేందుకు ఇష్టపడలేదు.
కానీ.. తాజాగా మాత్రం ఆయన లెక్కనే 70తో మొదలైంది. అంటే.. 2018తో పోలిస్తే ఏకంగా 30 సీట్ల తగ్గిన విషయాన్ని మర్చిపోకూడదు. కాకుంటే.. బాగా కష్టపడితే 90 సీట్లు ఖాయమని ఆయన చెప్పినా.. గతానికి వర్తమానానికి మధ్యనున్న వ్యత్యాసం అందరికీ అర్థమయ్యేలా మారిందని చెప్పక తప్పదు. ఆ మధ్యన జరిగిన కీలక సమావేశాల్లో సిట్టింగులకు టికెట్లు ఇచ్చే విషయంలో ఆయన అభిప్రాయం కుండబద్ధలు కొట్టినట్లుగా ఉండేది. పని తీరు బాగోలేకుంటే టికెట్లు ఇచ్చుడు కష్టమని తేల్చేసేవారు.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి మాట రావటం గమనార్హం. టీఆర్ఎస్ విధానంలో సిట్టింగులకే సీట్లు అనేది మౌలిక సూత్రంగా ఆయన చెప్పిన మాట విన్నప్పుడు.. లెక్క ఏదో తేడా కొట్టిన భావన కలుగక మానదు. తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. సిట్టింగులకు సీట్లు ఇస్తామని.. మరీ చెడగొట్టుకుంటేతప్పించి వారికే టికెట్లుగా ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఆసక్తికరంగా మారింది. ‘సిట్టింగులకే సీట్లు అనేది టీఆర్ఎస్ విధానం.
చెడగొట్టుకుంటే ఏమీ చేయలేం. మీ చేతుల్లోనే ఉంది. రెండు సార్లు చెప్పి చూస్తాం. మారకుంటే అప్పుడు వేరే వాళ్లకు ఇవ్వక తప్పదు’’ అన్న మాట ఒక ఎత్తు అయితే.. అందరిని గెలిపించుకునే బాధ్యత తనదిగా చెప్పిన కేసీఆర్ మాటలు ఆసక్తికరంగా మారాయి.
అందరూ గట్టిగా ఉండాలని.. బెదిరింపులకు.. ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదన్న గులాబీ బాస్ మాటల్ని చూస్తే.. గతంలో మాదిరి ధీమా మిస్ కావటమే కాదు.. ధైర్యం తగ్గిన భావన కలుగక మానదు. తన చుట్టూ ఉన్న వారికి తాను అండ అంటూనే.. మరోవైపు అందరూ తనకు అండగా ఉండాలనే మాటల్ని చూసినప్పుడు తెలంగాణ రాజకీయ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు ఇట్టే అర్థం కాక మానదు.