ఒకరికి మరొకరు నచ్చకున్నా.. నచ్చనోళ్లు కనిపిస్తే.. వారి మాటలు అభ్యంతరకరంగా ఉన్నా దాడి చేసేయొచ్చా? రాజకీయ నాయకులు తమ రాజకీయ విధానాల్ని తమ మాటలతో చెబుతుంటారు. నచ్చితే వారిని ఫాలో కావటం. నచ్చకుంటే వారి అన్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా కావాలంటే.. అలాంటి నేతల తీరును తప్పు పడుతూ రోడ్డు మీదకు వచ్చి.. తన లాంటి పది మందిని జట్టు కలిపి పోరాటం చేయ్. ఏం చేసినా.. ప్రజాస్వామ్యబద్ధంగా.. చట్టప్రకారం చేయాలి. అంతే తప్పించి.. వ్యక్తిగత భావోద్వేగాల్ని చేస్తున్న ఉద్యోగంలోకి తీసుకురావటం మహాపరాధంగా పరిగణించాలి.
తాజాగా చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న కుల్విందర్ కౌర్ గీతలన్ని దాటేశారు. బాలీవుడ్ సినీ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ చెంప ఛెళ్లుమనిపించిన ఆమె తీరుతో అందరూ షాక్ తిన్న పరిస్థితి. ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగి ఒకరు.. పంజాబ్ రైతులు చేసిన ఆందోళనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ చేయి చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ తీరును తీవ్రంగా ఖండించాల్సిందే. ఇలాంటి తీరును అస్సలు స్వాగతించకూడదు. అందునా.. క్రమశిక్షణతో కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన వారు.. లేనిపోని భావోద్వేగాల్ని ప్రదర్శిస్తే అదెంతటి భద్రతాలోపంగా మారుతుంది?
తాజాగా ఎంపీగా ఎన్నికైన కంగనా రౌనత్ చంఢీగఢ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకప్ కోసం వెళ్లినప్పుడు..ఆమెను తనిఖీ చేసిన భద్రతాధికారి చెంప ఛెళ్లుమనిపించటం.. ఎందుకిలా? చేశావ్ అని అడిగితే.. పంజాబ్ రైతులు నిరసన చేస్తున్న వేళ.. వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొంటూ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ అతి చేష్టకు పాల్పడిన కుల్విందర్ విషయానికి వస్తే ఆమె 2009లో సీఐఎస్ఎఫ్ లో చేరారు. 35 ఏళ్ల వయసున్న ఆమె, తన భర్తతో కలిసి సీఐఎస్ఎఫ్ లో పని చేస్తున్నారు. కుల్విందర్ సోదరుడు రైతు నాయకుడు.. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శిగా చెబుతున్నారు.
రైతులు చేస్తున్న ఆందోళనపై అప్పట్లో కంగనా మాట్లాడుతూ.. రూ.వందకు.. రెండు వందల రూపాయిల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని కంగనా పేర్కొన్నారని.. ఆమె మాట్లాడిన వేళలో తన తల్లి కూడా ఆందోళన చేస్తున్నట్లుగా కుల్విందర్ పేర్కొన్నారు. అయితే.. ఆమె తీరును తప్పు పడుతూ ఆమెను సస్పెండ్ చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో పాటు.. అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలకు రియాక్టు అయి ఇలా భౌతిక దాడులకు పాల్పడటం ఏ మాత్రం మంచిది కాదు.
ఈ తరహా తప్పుడు పనులకు కఠినంగా శిక్షించటమే కాదు.. ఇలాంటివి చేస్తే పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ.. కంగనా కావొచ్చు. రేపొద్దున ఇంకొకరు కావొచ్చు. అయినా.. ఒకరి మాటలు తప్పుగా ఉన్నాయని చెబుతూ.. ఇంకొకరు తమ చేతలతో తప్పుడు పనులు చేయొచ్చా? చట్టవిరుద్ధంగా వ్యవహరించొచ్చన్న భావన ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి తీరును ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. రానున్న రోజుల్లో విపరీతమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోకూడదు.