పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ విడుదలకు టైం దగ్గర పడింది. ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీ కాంబోలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పడుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మాళవిక నాయర్ వంటి ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే బయటకు వచ్చిన ట్రెజర్, ట్రైలర్స్, థీమ్ సాంగ్.. కల్కిపై అంచనాలను తారా స్థాయిలో ఏర్పడేలా చేశాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్ పరంగా కల్కి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం కల్కి మ్యానియా గట్టిగా కనిపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యింది మొదలు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
అయితే పెద్ద సినిమా కాబట్టి ఒక్కో టికెట్ ధర రూ. 200 నుంచి 500 వరకు ఉంటుంది. బెనిఫిట్ షోలు, బ్లాక్ టికెట్లు అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. కానీ ఒక థియేటర్ లో అధికారికంగా కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ ధర రూ. 2300 పలుకుతోందంటే నమ్మగలరా..? అది కూడా మన ఇండియాలోనే. ముంబైలోని మైసన్ పీవీఆర్ మల్టీప్లెక్స్ లోని ఓ స్క్రీన్ లో కల్కి సినిమా టికెట్ ధరను రూ.2300 గా నిర్ణయించారు. లివింగ్ రూమ్ స్క్రీన్ లో తొలి రోజు రాత్రి 9.15 గంటల షో కోసం టికెట్ ధర ఈ స్థాయిలో ఉంది. హిందీ వెర్షన్ కోసం అమ్ముతున్న టికెట్ ధర ఇది. తొలి రోజు రూ.2300 ధర నిర్ణయించిన మై సన్ ఐనాక్స్ థియేటర్.. వీకెండ్ కోసం రూ.2000 కు టికెట్లను అమ్ముతోంది. దీంతో ఓ అధికారిక టికెట్ ఇంత అత్యధిక ధర పలకడం కల్కి మూవీకి సాధ్యమవడం ఇప్పుడు ప్రభాస్ అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.