వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, అటు బీఆర్ఎస్ పార్టీని శాసించిన కేసీఆర్కు ఎంత కష్టమొచ్చింది! ఒకప్పుడు తన మాట వినకుండా పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను కేసీఆర్ పట్టించుకునేవారే కాదు. కానీ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన వాళ్లనూ తిరిగి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. అందుకు తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్లో చేరడమే రుజువని చెప్పాలి.
2018 ఎన్నికల్లో గెలిచి రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య విభేధాలు తారస్థాయికి చేరాయి. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం ఈ ఇద్దరూ తలపడ్డారు. తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. సిటింగ్ స్థానం కోసం రాజయ్య కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ చివరకు శ్రీహరికే టికెట్ ఇచ్చిన కేసీఆర్.. రాజయ్యను బుజ్జగించారు. ఆ ఎన్నికల్లో శ్రీహరి గెలిచారు. ఇక వరంగల్ బీఆర్ఎస్ సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లోకి వెళ్లిపోవడంతో ఆ టికెట్ కేటాయింపులోనైనా తనను పరిగణిస్తారేమోనని రాజయ్య ఆశపడ్డారు. కానీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకే టికెట్ దక్కడంతో రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
ఇక ఇప్పుడేమో కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో రాజయ్యనే పిలిచి మరీ నిలబెడతారనే టాక్ వినిపించింది. చివరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ సుధీర్కుమార్కు టికెట్ ఇచ్చారు. ఇక శ్రీహరి, కావ్య ఇద్దరూ కాంగ్రెస్లోకి వెళ్లిపోవడంతో స్టేషన్ ఘన్పూర్లో తిరిగి తనదే ఆధిపత్యమని భావించిన రాజయ్య మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చారు. కేసీఆర్ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు తప్పదని, స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నికకు రాజయ్య సిద్ధంగా ఉండాలని మరీ కేసీఆర్ చెప్పడం గమనార్హం.