మనదేశంలోనే ఇలాగుందో లేకపోతే యావత్ ప్రపంచమంతా ఇలాగే ఉందో తెలీటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏ రాష్ట్రంలో అప్పులున్నా, ఏ దేశంలో ఆర్ధిక ఇబ్బందులు మొదలైనా వెంటనే అందరికీ శ్రీలంక పరిస్ధితులే ఉదాహరణగా కనబడుతోంది. సంక్షోభాలకు శ్రీలంక ఒక రోల్ మోడల్లాగ అయిపోయినట్లుంది. ఇపుడిదంతా ఎందుకంటే మతప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మాట్లాడుతు ఇండియాలో కూడా శ్రీలంక పరిస్ధితులే కనబడుతున్నట్లు మండిపడ్డారు.
దేశంలో శ్రీలంక పరిస్ధితులు తలెత్తకముందే నరేంద్రమోడీని వెంటనే అధికారంలో నుండి దింపేయాలని పిలుపిచ్చారు. పాల్ సీరియస్ గా మాట్లాడుతున్నట్లు కనబడుతునే జోకులు కూడా వేయగలరని మరోసారి నిరూపించారు. తెలంగాణాలో తాను, ఏపీలో పవన్ కల్యాణ్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తెలంగాణా నుండే పోటీచేయబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డికి జన్మలో మద్దతుగా నిలిచేది లేదని కూడా చెప్పేశారు.
తెలంగాణాలో పోటీచేయాలని ప్రకటించినందుకు కేసీయార్ ఏమైపోవాలి ? మద్దతిచ్చేది లేదని ఖండితంగా ప్రకటించినందుకు జగన్ ఏమైపోవాలో పాల్ కనీసం ఒక్కసారి కూడా ఆలోచించినట్లు లేదు. తెలంగాణా ప్రజలంతా తననే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు కూడా చెప్పేశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీచేయటం కూడా వేస్టేనేమో. కేసీయార్-జగన్ ఇద్దరు కలిస్తే రెండు రాష్ట్రాలూ అభివృద్ధి జరిగేవన్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇగో సమస్యవల్లే ఇద్దరు కలవటంలేదన్న విషయాన్ని పాల్ బయటపెట్టారు.
తెలంగాణాలో తనపై జరిగిన దాడి కారణంగా తనకు అదనంగా 30 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు పెద్ద బాంబే పేల్చారు. అంటే టోటల్ గా ప్రజాశాంతిపార్టీకి ఎంతమంది ఓటర్లున్నారనే విషయాన్ని మాత్రం పాల్ చెప్పలేదు. తాను సీఎం అయితేనే తెలుగు రాష్ట్రాలకు మహర్దశగా చెప్పారు. మరి రెండురాష్ట్రాల్లో పోటీచేసి రెండుచోట్లా అధికారంలోకి వచ్చేస్తే సరిపోతుంది కదా. తమ్ముడు పవన్ కల్యాణ్ తనతో కలిస్తే వెంటనే ఏపీకి ముఖ్యమంత్రిని చేస్తాననే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మరి తమ్ముడు ఉపయోగించుకుంటారో లేదో చూడాలి.