తెలుగోడికి అరుదైన అవకాశం కలగనుంది. అత్యుత్తమ పీఠం మీద కూర్చునే అవకాశం తెలుగు ప్రాంతానికి చెందిన ప్రముఖుడికి దక్కనుంది. దేశ అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఆయన సూచన కార్యరూపం దాలిస్తే..బ48వ సీజేగా బాధ్యతలు ఒక తెలుగు వ్యక్తి చేపట్టనున్నట్లు అవుతుంది.
జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపున్నారు. హోం శాఖ పరిశీలన అనంతరం.. అక్కడ నుంచి ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళుతుంది. ఆయన ఆమోద ముద్ర పడితే.. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కానున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. ఏప్రిల్ 24న రమణ సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన 2022 ఆగస్టు 26 వరకు ఈ పదవిలో కొనసాగే వీలుంది. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి రమణనే. 1957 ఆగస్టు 27న ఏపీలోని క్రిష్ణజిల్లాలో జన్మనించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2000లో ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు పదోన్నతి పొందారు.
సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తదుపరి న్యాయమూర్తి ఎవరన్న విషయంపై లేఖ రాసిన తర్వాత.. నూటికి 99 శాతం ఆయన ప్రతిపాదనే కార్యరూపం దాలుస్తుంది. అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే మాత్రం.. పేరు మారే వీలుంది. కానీ.. అలాంటి అవకాశం దాదాపుగా ఉండదన్న మాట వినిపిస్తోంది.