చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఈ ఏడాది ఏప్రిల్ లో అరెస్టయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ లో ఉన్న రామకృష్ణ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు….జడ్జి రామకృష్ణకు రూ.50 వేల పూచీకత్తుతో పాటు, షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
విచారణాధికారికి జడ్జి రామకృష్ణ సహకరించాలని, ఈ కేసు అంశంపై మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. ఏప్రిల్ 12న ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘జగన్ మోహన్‌రెడ్డి కంసుడిలా తయారయ్యాడు. ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.. నేను కృష్ణుడిగా భావించి.. నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్మోహన్రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జడ్జి రామకృష్ణపై చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. దీంతో, జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పీలేరు సబ్ జైలులో రామకృష్ణ రిమాండ్ లో ఉన్నారు. తాజాగా రామకృష్ణకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఈ రోజో రేపో విడుదల కాబోతోన్నారు.