‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలైన దగ్గర్నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న గొడవ గురించి తెలిసిందే. ఇలా రెండు పెద్ద ఫ్యామిలీస్‌కి చెందిన టాప్ స్టార్లు కలిసి మల్టీస్టారర్ చేస్తున్నందుకు సంతోషించకుండా.. సినిమాలో తమ హీరోదే పైచేయి అంటే.. తమ హీరోదే పైచేయి అంటూ ఇరు వర్గాల అభిమానులు సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నారు. సినిమా రిలీజయ్యాక ఈ గొడవలు ఇంకా పెరిగాయే కానీ తగ్గలేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో తారక్, చరణ్ అభిమానుల గొడవలు కొనసాగుతూనే ఉండడం గమనార్హం.
తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల వేడుకకు రామ్ చరణ్ హాజరు కావడం.. ఆ స్టేజ్ మీద సందడి చేయడం.. ‘ఆర్ఆర్ఆర్’కు గాను అవార్డు స్వీకరించడం తారక్ అభిమానులకు నచ్చలేదు. ఈ వేడుకలో చరణ్ మాత్రమే హైలైట్ కావడం తారక్ ఫ్యాన్స్‌కు రుచించక.. సోషల్ మీడియాలో్ పెద్ద గొడవే చేస్తున్నారు. చరణ్‌ను టార్గెట్ చేయడమే కాక.. హెచ్‌సీఏ మీద కూడా విమర్శలు గుప్పించారు. ఇదంతా మెగా ఫ్యామిలీ పీఆర్ మహిమ అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాగా ఈ వివాదంపై స్వయంగా హెచ్‌సీఏ ప్రతినిధులు స్పందించారు. అవార్డుల వేడుకకు తారక్‌ను కూడా తాము ఆహ్వానించినట్లు వెల్లడించారు.
‘‘ఆర్ఆర్ఆర్ సినిమాను అభినిస్తున్న, మద్దతుగా నిలుస్తున్న వారికి నమస్కారం. మేం అవార్డుల వేడుకకు తారక్‌ను కూడా ఆహ్వానించాం. ఇండియాలో ఒక సినిమా షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోయారు. మేం త్వరలోనే అవార్డును ఆయనకు అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని హెచ్‌సీఏ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఐతే తారక్ తన సోదరుడు తారకరత్న చనిపోవడం వల్లే ఈ వేడుకకు రాలేకపోయాడని ఒక అభిమాని పేర్కొనగా, దీనిపై హెచ్‌సీఏ స్పందిస్తూ.. ‘‘ఓ సినిమా షూటింగ్ కారణంగా తాను రాలేకపోతున్నట్లు ఆయన మాతో చెప్పారు. ఆ తర్వాత వారి సోదరుడు చనిపోవడంతో షూటింగ్ ఆపేశారు’’ అని పేర్కొంది.