ఏపీ సీఎం జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వైసీపీ నేతలు జే ట్యాక్స్ విధిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత ఏడాది జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం ఛోటామోటా వ్యాపారులు మొదలు కార్పొరేట్ కంపెనీల వరకు అందరి దగ్గర నుంచి దాదాపు రూ.1000 కోట్లు జే ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దేశంలో ఎక్కడైాన కొబ్బరికాయ కొట్టి కొత్త ప్రాజెక్టులు, పనులు మొదలుబెడతారని, కానీ, ఏపీలో మాత్రం జేఎంఎం ట్యాక్స్ కట్టి పనులు ప్రారంభించాల్సిన దుస్థితి ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్…నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లిస్తేనే పనులు చేసుకునేందుకు వైసీపీ నేతలు అనుమతిస్తున్నారని దుయ్యబట్టారు.
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బెదిరింపులే ఈ ఆరోపణలకు నిదర్శనమని అచ్చెన్న అన్నారు. వారి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న దుయ్యబట్టారు. లిక్కర్, ఇసుక, మైనింగ్, రేషన్, పేకాట వంటి వ్యవహారాలతో వచ్చే ఆదాయం జగన్ సర్కార్ కు సరిపోవడం లేదని, ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక నానా తిప్పలు పడుతున్నారని, దానికి ఈ ట్యాక్సులు అదనమని మండిపడుతున్నారు.
గత రెండేళ్ల కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు నాయకుల దోపిడీకి భయపడి టెండర్లు వేయడం మానేశారని, వేసిన వారికి ట్యాక్సుల భయం పట్టుకుందని దుయ్యబట్టారు. జగన్నాధ రథ చక్రాలొస్తున్నాయని చెప్పిన జగన్…..వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మారకుంటే రహదారుల గోతుల్లో వైసీపీని ప్రజలు తొక్కేస్తారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.