అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చీనీ పంటకు కేతిరెడ్డి దాదాపు 86 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం పొందారని, ఆయన చీని తోటను సందర్శించేందుకు తాను వెళుతున్నాను అని జేసీ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దమ్మున్న మగాడు ఎవడైనా జేసీ వెంట తన చీనీ తోటలో అడుగుపెట్టి చూడాలని పెద్దారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను ఎమ్మెల్యే కాకపోయి ఉంటే ఇంట్లో నుంచి జేసీని బయటకు లాక్కొచ్చి చెప్పుతో కొట్టుకుంటూ తాడిపత్రి వీధిలో తిప్పుతానని పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ఘాటుగా స్పందించారు. కేతిరెడ్డి కుటుంబం ఎలా బతికిందో దాన్ని చెబుతానని పెద్దారెడ్డి చిన్నాన్న చేసిన బీమా అక్రమాల గురించి చెబుతానని, అప్పుడు ఆయనను చెప్పుతో కొట్టాలని జేసీ సవాల్ విసిరారు. కేతిరెడ్డి కుటుంబం ఎలా బతికిందో తనకు తెలుసని ఆ వివరాలను బట్టబయలు చేస్తానని జేసీ వార్నింగ్ ఇచ్చారు.
లండన్ లో వెయిటర్ గా పని చేసిన కేతిరెడ్డి ధర్మవరానికి వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాలలో కేతిరెడ్డి బాధితులు కోకొల్లలుగా ఉన్నారని, వారంతా కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు ఇస్తామంటూ తనకు ఫోన్ చేస్తున్నారని జేసీ ఆరోపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై ఎన్నో ఫిర్యాదులున్నాయని అన్నారు. మరి, జేసీ సవాల్ కు కేతిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.