జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్నటి వేళ వీర మహిళలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబంధించి పలు విషయాలపై వారితో మాట్లాడారు. నిపుణులు కొందరు తరగతులు నిర్వహించారు. రాజకీయ అంశాలపై వారికి అవగాహన కల్పించారు. నిన్న రోజంతా వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ నాయకత్వాలకు కొన్ని విషయాలపై స్పష్టత ఇస్తూ శిక్షణ శిబిరాన్ని కొనసాగించారు.
ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని పొగిడారు. ఢిల్లీలో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న పద్ధతిని వివరిస్తూ, కేజ్రీ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రయత్నిస్తే మార్పు సాధ్యమేనని, అధ్యయనం, జ్ఞానం కారణంగానే మంచి మార్పులు సిద్ధిస్తాయి అని కూడా చెప్పారు.
అంటే వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో వెళ్తారా ? ఇప్పటికే బీజేపీతో బంధాల గురించి పెద్దగా మాట్లాడడం మానుకున్నారు జనసేన నాయకులు. పొత్తుల విషయమై ఎటువంటి క్లారిటీ లేదు. టీడీపీ కూడా ఒంటరిగా వెళ్లేందుకు ఉన్న అవకాశాలు సైతం పరిశీలిస్తోంది అని తెలుస్తోంది.
బీజేపీ కూడా పొత్తుల్లేని పోటీనే ఇష్టపడుతోంది కొన్ని సార్లు. కొన్ని సార్లు మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసి కొన్ని చోట్ల అయినా పరువు నిలబెట్టుకునే పనులు చేయాలని కూడా పరితపిస్తోంది. కనుక ముందు,వెనుక ఊగిసలాటలు అయితే కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కాస్త ఆసక్తినే రేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పనిచేయనున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఆయన అల్లూరి విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి భీమవరంలో ప్రత్యక్షమై బీజేపీ నాయకులతో మాట్లాడి వచ్చారు.
అంటే ఆయన ఆప్-లోకి వెళ్లరనే అనుకోవాలి. ఈ తరుణాన పవన్ – ఆప్ చర్చలు ఒకవేళ సాగితే కొత్త ఈక్వేషన్లు కొన్ని తెరపైకి వస్తాయి. అప్పుడు బీజేపీ కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశాలుంటాయి.