ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పోరు రసవత్తరంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ…మరోపక్క ఎన్ డి ఏ కూటమి….గెలుపు మాదంటే మాది అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీకైనా, ఏ అభ్యర్థికైనా గెలుపుపై ధీమా ఉండడం తప్పు కాదు. కానీ, మితిమీరిన అతి విశ్వాసం ఉండటం మాత్రం అతిశయోక్తి అనిపించక మానదు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సమంజసం…కానీ, తమ పార్టీ గెలుస్తుందని, ఏకంగా కాబోయే సీఎం ప్రమాణ స్వీకారం తేదీని కూడా ముందుగానే ప్రకటించడం మాత్రం కాస్త అతి అనిపించుకోక మానదు.
ఇటువంటి అతి విశ్వాసంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన అతి పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో సీఎంగా జగన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆల్రెడీ జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఒక అడుగు ముందుకు వేసిన వైసీపీ సోషల్ మీడియా విభాగం ఏకంగా అధికారికంగా ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. దీంతో, ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. గెలుపుపై ధీమా, విశ్వాసం ఉండడంలో తప్పు లేదని…కానీ, ఇలా ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకారం తేదీ అని ప్రకటించడం సరికాదని వైసీపీ తీరును నెటిజనులు విమర్శిస్తున్నారు. అయితే, మరి కొందరు నెటిజన్లు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారం ఫలానా తేదీన జరుగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన తేదీన కాకపోయినా ఇంకో తేదీన ప్రమాణస్వీకారం చేశారు. మరి, జగన్ విషయంలో కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న ధీమా నిజమవుతుందా? లేదా? వైసీపీది ఆత్మ విశ్వాసమా? అతి విశ్వాసమా? అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.