ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని.. ఇటీవల టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి.. కొన్ని ఉదాహరణలనూ ఆయన వెల్లడించారు. దీంతో జగన్ మానసిక పరిస్థితి బాగోలేదా? అనే చర్చ జరుగుతోంది. వాస్తవాని జగన్ వ్యవహార శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తెలుగులో ఆయన చేసే ప్రసంగాలను కూడా చూసి చదువుతారు. అంతేకాదు.. రాష్ట్రంలో తాను తీసుకువచ్చిన పథకాల వివరాలను కూడా చూసే చెబుతుంటారు. ఇవన్నీ విమర్శలకు దారితీసినవే.
ఇటీవల విజయనగరంలో రైలు ప్రమాదం సంభవించింది. 70 మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనా ప్రాంతాన్ని చూసేందుకు.. జగన్ వెళ్లాలని అనుకుంటే.. అక్కడి అధికారులు సెక్యూరిటీ నేపథ్యంలో పనులకు ఆటంకం ఏర్పడుతుందని వద్దన్నారు. దీంతో జగన్.. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం.. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే..ఈ రెండు సందర్భాలు కూడా విమర్శలు వచ్చేలా చేశాయి.
నిజానికి ఏరియల్ సర్వే అనేది వరద ప్రభావిత లేదా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేస్తారు. కానీ, రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు జగన్ ఏరియల్ సర్వే చేయడం వింతగాను.. ఆశ్చర్యంగాను అనిపించిందని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీమ్స్ కూడా వచ్చాయి. ఇక, ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సమయంలో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమయంలో ఒకింత గంభీరంగా.. వారిని పరామర్శించి ఓదార్చాల్సిన సీఎం జగన్.. కులాసంగా.. చిద్విలాసంగా నవ్వు వ్యక్తీకరిస్తూ.. బాధితులతో మాట్లాడారు.
`నా చెయ్యివిరిగిపోయింది మొర్రో` అని ఓ బాధితురాలు అంటుంటే.. జగన్ నవ్వుతూ.. కనిపించారు. ఈ పరిణామాలపైనా తీవ్ర విమర్శలు, మీమ్స్ వచ్చాయి. ఇవన్నీఇలా ఉంటే.. లేని కేసులు ఉన్నాయని చూపిస్తూ.. 14 ఏళ్లపాటు పాలించిన చంద్రబాబు ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం.. ఎఫ్ ఐఆర్‌లో కూడా పేరు లేకుండా ఆయనను నిర్బంధించడం వంటివి కూడా జగన్ మానసిక పరిణామంపై విమర్శలు వచ్చేలా చేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ హల్చల్ అవుతున్నాయి. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదా? అనే చర్చ మరోసారి ఊపందుకుంది.దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.