గత ఎన్నికల్లో వైసీపీకి అశేష అవశేషాంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మునుపెన్నడూ లేని విధంగా ఆ పార్టీకి ప్రజలు 151 సీట్లతో భారీ గెలుపును అందించారు. ఇంకా చెప్పాలంటే, జగన్ ఒక్క చాన్స్ అన్న డైలాగ్ కు పడిపోయిన జనం….టోకుగా ఓట్లు గుద్దేశారు. మరీ ఓపెన్ గా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కొంతమంది పేర్లు కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలీదు.
అయితే, ఇదంతా మూడేళ్ల కిందటి ముచ్చట. ఎందుకంటే, ప్రస్తుతం వైసీపీ పాలన మూన్నాళ్ల ముచ్చటగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే, ఈ సారి ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక కాదన్న విషయం జగన్ కు క్లీయర్ గా అర్థమైంది. దీంతో, ఈ సారి గెలుపు గుర్రాలతోపాటు పనిచేసేవారికే టికెట్లు ఇవ్వాలని జగన్ గట్టిగా ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రోగ్రెస్ కార్డులను జగన్ తెప్పించుకున్నారు.
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేసిన వాళ్లకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని, తన మీద అలిగినా పరవా లేదని జగన్ తెగేసి చెప్పారు. పనిచేయని వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని, తనతో పాటు ఎమ్మెల్యేలూ పనిచేస్తేనే 2024 ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలుంటాయని తేల్చేశారు.
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కొందరు ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవడం లేదని జగన్ అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని 5 రోజుల్లో ముగించి మమా అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక్క రోజు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2 రోజులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మండిపడ్డారు. ఐదుగురు మంత్రులు కనీసం 10 రోజులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని జగన్ తన పార్టీ ఎమ్మెల్యే ప్రొగ్రెస్‌ను ఆ సమీక్షలో బయటపెట్టారు. జగన్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టుతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.