ఏపీ సీఎం జగన్ను పొగడ్తలతో ముంచెత్తే పథకం ఏదైనా పెట్టారా? పనిగట్టుకుని ఆయనను పొగడకపోతే.. పనిచేసినట్టు అనిపించడం లేదా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే..ఏపీ అసెంబ్లీ దాదా పు ఆరు మాసాల తర్వాత.. ఈ రోజు కొలువుదీరింది. గత మే నెలలో ఒకసారి బడ్జెట్ సమావేశాల కోసం.. ఏర్పడిన సభ.. కేవలం ఒక్కరోజుకే పరిమితమైంది. తర్వాత.. మళ్లీ ఆరు మాసాలకు నిర్వహించాలనే సాంకేతిక అంశం ముడిపడి ఉండడంతో ఈ రోజు నిర్వహించారు. అయితే.. ఆరు రోజులు సభను నిర్వ హించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఇంత వరకుబాగానే ఉన్నా.. తొలిరోజు పూర్తిగా.. సభను మహిళలకే కేటాయించారు. మహిళా సాధికారత.. సహా మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాలపై చర్చించాలని నిర్ణయించారు. అయితే.. ఈ సభనుపూర్తిగా జగన్ను పొగిడేందుకే పరిమితం చేశారా? అనే విధంగా మారిపోయింది. తొలుత మాట్లాడిన మంత్రి తానేటి వనిత నుంచి ఎమ్మెల్యే రోజా వరకు కూడా జగన్పై పొగడ్తల వర్షం కురిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమయంలో తాజాగా వచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలు.. అదేవిధంగా.. కుప్పంలో వైసీపీ విజయాన్ని ప్రస్తావించారు తప్ప.. నిజంగా.. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరూ ప్రస్తావించలేదు.
వాస్తవానికి ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహణకు.,. ఎమ్మెల్యేల జీత భత్యాలు.. భోజనాలు..నిర్వహణ ఖర్చు ఏకంగా పాతిక లక్షలు. ఇదంతా ప్రజాధనమే. అయినప్పటికీ.. ప్రజల సమస్యలపై చర్చించకుండా.. పాడిందే పాట అన్నట్టుగా.. రోజా మొదలు అందరూ.. జగన్పై పొగడ్తలతోనే సరిపుచ్చారు. దీంతో సభా వ్యవహారాలు చూసిన వారు.. పెదవి విరుపు తప్ప.. ఏమీ చేయలేక పోయారు. ఈ మాత్రానికి.. పాతిక లక్షల ఖర్చు ఎందుకు? మీడియా మీటింగులు పెడితే సరిపోతుంది కదా! అంటున్నారు. ఇక, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. వచ్చి ఉంటే.. రచ్చ రచ్చ అయ్యేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జగనన్న పొగడ్తల పథకం ఏదైనా ప్రవేశ పెట్టారా? అన్న ఈ సభల పై తీవ్ర విమర్శలు వస్తుండడం గమనార్హం.