కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం శనివారం రాత్రి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమైద్ భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 1500 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో ఎక్కువ మంది హాజరైనట్టు సమాచారం. వివాహాన్ని తొలుతు ఐదు రోజుల పాటు తెలుగు వారి సంప్రదాయంలో నిర్వహించాలని అనుకున్నా.. షర్మిల బిజీ షెడ్యూల్ కారణంగా మూడు రోజులకు కుదించారు. దీంతో ఈ నెల 15న సాయంత్రానికే అతిధులు రాజస్థాన్‌కు చేరుకున్నారు.
బుధవారం సాయంత్రం షర్మిల కుటుంబ సమేతంగా జోధ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు. మూడు రోజులపాటు వైయస్ షర్మిల రెడ్డి తనయుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుని.. ఆ మేరకు కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. 16వ తేదీ సంగీత్, మెహందీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను షర్మిల తన ట్విట్టర్లో పంచుకున్నారు.
ఇక, శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా వివాహవేడుకలో ఒకటయ్యారు. ఇక 18వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాల వేడుకను నిర్వహించనున్నారు. కుమారుడి నిశ్చితార్థ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన షర్మిల, అనిల్ దంపతులు వివాహ వేడుకను కూడా అంతే ఘనంగా నిర్వహించారు.
ఎంగేజ్మెంట్ వేడుక గత నెల 18వ తేదీన హైదరాబాద్‌లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ తో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైయస్ షర్మిల తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులను ఆహ్వానించారు. అయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు ఆదివారం వెళ్లే అవకాశం ఉంది. మరో వైపు షర్మిల అన్న.. వరుడు రాజారెడ్డికి స్వయానా మేనమామ సీఎం జగన్ మాత్రం వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.