ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నేటి ఏపీ సీఎం…నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ను వైసీపీ నేతలే పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే సాయంతో రక్తి కట్టించారని ఆరోపణలు వచ్చాయి. జగన్ పై దాడి చేసిన శ్రీను వైసీపీ కార్యకర్త అని, ఆ దాడి వైసీపీనే చేయించిందని నాడు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ఘటన సింపతీ కొట్టేసిన జగన్…సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.
ఈ క్రమంలోనే కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఆ బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు కరాఖండిగా చెప్పేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ను ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదని నిందితుడి తరఫున న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు.
జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, ఆ స్టేట్ మెంట్ రికార్డు విషయం చార్జిషీట్ లో ఎందుకు ప్రస్తావించలేదని కోర్టు ప్రశ్నించింది. బాధితుడిని విచారణ జరపకుండా మిగతా సాక్షులను విచారణ జరిపి ఉపయోగం ఏంటని కోర్టు ప్రశ్నించింది. బాధితుడు జగన్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. దీంతో, ఈ కేసులో జగన్ కోర్టు మెట్లెక్కక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.