ఇతర రాష్ట్రాల కంటే కూడా.. చాలా సున్నితమైన సునిశితమైన రాజకీయాలు.. మతాలు.. బిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇక్కడ ఎలాంటి మత ఘర్షణలు లేకపోయినా.. ఎవరి మతాన్నివారు ఎంతో గౌరవించుకుంటారు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. దీనిని బిల్లు చేసి.. తర్వాత చట్టంగా మార్చే ప్రయత్నం చేస్తోంది.
తద్వారా.. దేశంలో మతాలపై నిర్బంధాలు ఏర్పడతాయనేది ఆయా వర్గాల మాట. ఇదిలావుంటే.. ఈ బిల్లును ఆమోదించుకునేందుకు మోడీ సర్కారు కు లోక్‌సభలో తగినంత బలం ఉంది. కానీ, రాజ్యసభకు వచ్చే సరికి మాత్రం అనుకూల పార్టీల దన్ను అవసరం. ఇప్పటి వరకు మోడీ సర్కారు ఏం చేసినా.. పార్టీలు సహకరిస్తూ వచ్చాయి. అంతెందుకు.. ఎదురెళ్లి మరీ మద్దతు తెలిపిన వైసీపీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలోని టీడీపీ, వైసీపీ పార్టీలుకేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతిచ్చే విష యంపై చర్చ సాగుతోంది. ఉమ్మడి పౌరస్మృతిపై మీరు మద్దతివ్వక తప్పదని కేంద్రం ఇప్పటికే జగన్‌కు తేల్చి చెప్పినట్టు జాతీయ మీడియా పేర్కొన్న దరిమిలా.. ఆయన తర్జన భర్జన పడుతున్నారు. యూసీసీకి తాను ఓకే చెబితే.. మైనారిటీ ఓటు బ్యాంకు పోతుందనే ఆవేదన, ఆందోళన జగన్‌లో కనిపిస్తోంది. కానీ.. ఇప్పటికేయూసీసీ కమిటీలో చైర్మన్‌గా ఉన్న కేంద్ర మంత్రి రిజిజు.. తాజాగా ఏపీ సీఎంను కలిసి వెళ్లారు.
దీని అంతరార్థం.. జగన్ సమ్మతిని కేంద్రం తెలుసుకోవడమేనని అంటున్నారు. అంతేకాదు.. ఇప్పటికి ప్పుడు.. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం చేయాల్సి రావడం మరింత ఇబ్బందిగా ఉంది. యూ సీసీ వల్ల కేవలం మైనారిటీ ముస్లింలకే కాకుండా.. గిరిజన తెగల సంప్రదాయం.. జైనులు, బౌద్ధులు.. సిక్కులు వంటివారి సంప్రదాయాలపైనా ప్రభావం పడుతోందని మేధావులు చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ కు ఇది పెద్ద సంకటంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. కాదంటే.. కేసుల కొరడా.. ఔనంటే.. ఓటు బ్యాంకుకు గండి.. అనే పరిస్థితిలో జగన్ చిక్కుకున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.