రెండున్నరేళ్ల తరువాత అందరినీ మార్చేసి పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని కొలువుదీర్చాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
ఆ లెక్కన అన్ని మంత్రిత్వ శాఖలకూ కొత్త మంత్రులే వస్తారు. దీంతో రెండున్నరేళ్లుగా మంత్రి పదవి కోసం చకోర పక్షుల్లా చూస్తున్న నేతలు విస్తరణ కోసం ఆశగా చూస్తున్నారు. మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నవారు మాత్రం ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు.
అయితే, ఒకరిద్దరు మాత్రం మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తున్నా తెగ టెన్షన్ పడుతున్నారట. అందుకు కారణం… తమనెక్కడ ఆర్థిక మంత్రి పదవి తీసుకోమంటారో అని భయమట.
అవును.. మామూలుగా అయితే, ఆర్థిక మంత్రి పదవి అంటే ఏ నేత అయినా ఎగిరి గంతేస్తారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ ఆర్థిక మంత్రి పదవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనుకుంటున్నారట.
నెలనెలా జీతాలు, పింఛన్లు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఏపీ ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు.
ముఖ్యంగా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చాలాకాలంగా మంత్రి పదవి కోసం చూస్తున్నారు. మంత్రిగా ఆయను సుదీర్ఘ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పదవికి ఆయన పేరు వినిపిస్తోంది. దీంతో ధర్మాన ఈ రెండున్నరేళ్లు మంత్రి పదవి లేకపోయినా ఫరవాలేదు కానీ ఆర్థిక మంత్రి పదవి వస్తే మాత్రం రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారట.
రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో నేత పేరు కూడా ఆర్థిక మంత్రి పదవికి వినిపిస్తోంది. ఆయన కూడా ధర్మాన మాదిరే ఆందోళన చెందుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
ఫథకాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుండడం.. ఆదాయం ఆ స్థాయిలో లేకపోవడంతో అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది.
దీంతో విపక్షాలు నిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. జీతాలు సకాలంలో వేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక మంత్రి పదవి అంటే కత్తి మీద సామే అంటున్నారు వైసీపీ సీనియర్లు.