ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తీరే వేరు. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కులమైన కమ్మల నుంచే నేతలు ప్రెస్ మీట్లకు వస్తారు.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికి కాపు నాయకులు రావడమూ కామనే. మంత్రుల్లో కొందరికి పర్టికులర్‌గా ఈ బాధ్యతను అప్పగించి వారితో ప్రెస్ మీట్లు పెట్టించడం.. దారుణమైన మాటలు అనిపించడం వైకాపాకే చెల్లు.
ఈ ప్లానింగ్ అంతా వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగనే చేస్తారని.. ఆయన్ని మెప్పించేలాగే మంత్రులు ప్రెస్ మీట్లలో మాట్లాడాతారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఐతే ఇప్పటిదాకా జరిగిందంతా ఒకెత్తయితే.. ఇప్పుడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు.
ప్రతిపక్ష పార్టీలను తిట్టమంటూ పార్టీ నాయకులకు చెప్పడం వరకు ఓకే కానీ.. సివిల్ సర్వెంట్లకు ఈ మేరకు మార్గనిర్దేశనం చేయడం ఏపీ ముఖ్యమంత్రికే చెల్లింది. సంక్షేమ పథకాల మీద, ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని. అలాంటి వారిని ఉపేక్షించవద్దని చెబుతూ.. ఇలాంటి వాటి మీద తిట్టే కార్యక్రమాలు చేయండి అని జగన్ ప్రెస్ మీట్లో పేర్కొనడం గమనార్హం.
ప్రతిపక్షాలు చెప్పే మాటలను జనాలు ఎంతో కొంత నిజం అనుకునే ప్రమాదం ఉందని.. కాబట్టి ఇలాంటి వారిని తిట్టడానికి వెనుకాడవద్దని జగన్ సూచించారు. ఐతే ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టండి అంటే ఓకే కానీ.. తిట్టే కార్యక్రమాలు చేయండ అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం విడ్డూరం. ప్రతిపక్షాలను ఎటాక్ చేసే విషయంలో, అధికారుల మీద పెత్తనం చలాయించే విషయంలో ఇది ఇంకో లెవెల్ అంటూ జగన్ మీద విమర్శలు తీవ్ర వ్యక్తమవుతున్నాయి.