ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం మీద కక్ష సాధింపుతో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రజావేదిక కూల్చివేత మొదలు…తెలుగు అకాడమీ పేరు మార్చడం వరకు జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇక, కేబినెట్ విస్తరణలోనూ తన మార్క్ చూపించిన జగన్…మొదటి బ్యాచ్ మంత్రులకు రెండున్నరేళ్ల డెడ్ లైన్ పెట్టారు.
తాజాగా ఆ డెడ్ లైన ముగియనుండడంతో మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన భేటీలో మంత్రులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ముగ్గురు మంత్రులపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా సదరు మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ నిలదీసినట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.
విపక్షాల విమర్శలకు దీటుగా జవాబిచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించి మరీ జగన్ ఆ మంత్రులను పాయింట్ ఔట్ చేశారట. బీజేపీ, టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని, పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిన ఘటనపై ప్రతిపక్షం విమర్శలకు దీటుగా ఎందుకు జవాబివ్వలేదని జగన్ నిలదీశారట. పద్దతి మార్చుకోవాలని, లేదంటే కష్టమని డెడ్ లైన్ ను ఉద్దేశించి మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇకపై, ప్రతి అంశాన్ని పరిశీలిస్తానని, అందరిపైనా ఫోకస్ పెడతానని జగన్ అన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.