శివరాత్రి, తారకరత్న మృతి వంటి కారణాలతో 3 రోజులపాటు లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో లోకేష్ తన పాదయాత్రను మళ్లీ మొదలుబెట్టారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో మైనారిటీలతో నారా లోకేష్ సమావేశమయ్యారు. మైనారిటీల్లో పేదరికం ఎక్కువగా ఉందని అన్న ఎన్టీఆర్ ఆనాడే గుర్తించి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
అప్పటి నుంచి మైనారిటీ కార్పొరేషన్ కొనసాగుతోందని, జగన్ రెడ్డి వచ్చాక దానిని తీసేశారని మండిపడ్డారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు జగన్ ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. జగన్ మాదిరి పప్పుబెల్లాలు ఇచ్చి చేతులు దులుపుకోబోమని వాగ్దానం చేశారు. మైనారిటీ సోదరులకు ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ క్లస్టర్లో స్థానం కల్పించి, మీరే ఉద్యోగాలు కల్పించేలా విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
ఇక, ప్రశాంతంగా సాగే తన పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. జగన్ ఆదేశాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మతకలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడు వాడే వజ్ర వాహనాన్ని తన పాదయాత్రకు పంపించారని ఫైర్ అయ్యారు. తానంటే జగన్ రెడ్డికి భయం. అని, అందుకే అడుగడుగునా ఇలా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సుబ్బనాయుడు కండ్రిగ గ్రామంలో తన పాదయాత్ర సందర్భంగా పోలీసులు, ఈ వజ్రా వాహనాన్ని జగన్ రెడ్డి గారు పంపారని, ఇవి చూశాక తానంటే జగన్‌కి ఎందుకంత భయమో చెప్పాలని లోకేష్ అన్నారు.