ఏపీలో జగన్ పాలన ప్రారంభమై.. రెండున్నరేళ్లు అవుతోంది. మరికొద్ది రోజుల్లో.. దీనికి సంబంధించిన సంబరాలు చేసుకునేందు కు వైసీపీ నాయకులు కూడా రెడీ అయ్యారు. అయితే.. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు వస్తున్నాయి. `ఒక్క సారి వెనక్కి చూడు జగనన్నా!` అంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికి కారణం.. రాష్ట్రంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్.. ఈ దిశగా ఏం చేశారనేది నెటిజన్ల ప్రశ్న. వెనుదిరిగి చూసు కుంటే.. ప్రజలకు అది కూడా ఓ వర్గం ప్రజలకు నిధులను సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టడంతప్ప.. రాష్ట్రంలో ఒరిగింది ఏమైనా ఉందా? అనేది వీరి ప్రశ్న.
మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గం పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పన్నులు కడుతున్నది తామేనని.. కానీ.. తమను మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోగా.. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలోను.. తమ వర్గాలకు అవసరమైన చర్యలు తీసుకోవడంలోనూ జగన్ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు.
రెండున్నరేళ్ల కాలంలో పెట్టుబడులు రాలేదు. ఉపాధి పెరగలే దు. కరోనా ప్రభావం ఉందని అనుకున్నా.. మిలిగిన చర్యలైనా చేపట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమకేం చేసిందని ప్రశ్నిస్తున్నారు.
తాము పన్నులు కడితే.. పేదలకు పంచి పెడుతున్నారు అన్నది మధ్యతరగతి వర్గాల ప్రధాన ఆవేదన. ఇక ఉన్నత వర్గాలు సైతం ఏపీలో ఏమీ జరగడంలేదంటూ తేల్చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక చిక్కుల్లో ఉంది. దీనికి కారణం ఎవరు? ఈ రెండేళ్ల కాలంలో ఆదాయం పెంచుకుంటే కాదన్నవారు ఎవరైనా ఉన్నారా? అనేది మధ్యతరగతి ప్రశ్న. ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది.
కేవలం 65 కోట్లు దాటి ఆదాయాలు రావడంలేదు. దానికి తోడు జగన్ హామీలతో ఖర్చులు పెరిగాయి. కరోనా నేపథ్యంలో రెవెన్యూ ఎక్కడికక్కడ పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు.
ఇక ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఏదో సమయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేయక తప్పని పరిస్థితికి చేరుకుంటుందనేది మధ్యతరగతి వర్గాల భావన. అయితే.. ఇదంతా ఎందుకు వచ్చింది.? ఇప్పుడు రెండున్నరేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోని వారు.. వచ్చే రెండేళ్లు చేస్తాం.. అంటే.. ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు.
ఇవన్నీ ఇలా.. ఉంటే.. రాష్ట్రంలో అవకాశాలు తగ్గిపోతున్నాయనేది ప్రధాన ప్రశ్న. పరిశ్రమలు కూడా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే విద్యుత్ బిల్లులను భారీగా పెంచారు. రుణ సదుపాయాలు లేవు. పన్నులు పెంచారు. ఇలాంటి సమస్యలతో పరిశ్రమలు తీవ్ర ఇరకాటంలో పడి ఉపాధి కోల్పోతున్న వారు పెరుగుతున్నారు.
మరోవైపు.. ప్రభుత్వం కొన్ని వర్గాలకు మాత్రమే.. సంక్షేమాన్ని పరిమితం చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఆదాయ మార్గాలు పెరగాలి. కానీ జగన్ అనుభవ లేమితో ఉన్న పరిశ్రమలకే ఇబ్బందులు తెస్తున్నారు. కొత్తగా మరేమీ రాకుండా పోతున్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా అయోమయంగా ఉందని అంటున్నారు.
నిజానికి జగన్ ఒక పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు.. అనేక సంస్థలను విజయవం తంగా నడిపించారు. ఇప్పుడు మాత్రం ఈ రెండున్నరేళ్లలో కేవలం తన రాజకీయాల కోసం.. ఏపీని బలి చేశారా? అనే భావన, వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఇదే కనుక మరో రెండేళ్లు కొనసాగితే.. ఏపీ కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. అందుకే.. మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఇప్పటి వరకు జరిగిన రెండున్నరేళ్ల పాలనను జగనే స్వయంగా వెనుదిరిగి చూసుకోవాలని.. నెటిజన్లు సూచిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.