కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ విషయంలో అనేక అంశాలు ఇప్పటికీ.. ప్రజలను విస్మయానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటి! ఉమ్మడి ఏపీని విడదీసి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును.. ఆ పార్టీలోని అనేక మంది వ్యతిరేకించిన విషయం తెలిసిందే. చాలా మంది సర్దుకు పోయినా.. దీనికి రెండింతల మంది వ్యతిరేకించి పార్టీకి గుడ్ బై చెప్పారు. సరే! ఇప్పుడు ఇదే అంశంపై మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ రాసిన తన జీవిత కథ `ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్` పుస్తకంలో మరింత విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయి.
ప్రజాకర్షక నాయకత్వాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని పేర్కొన్న ప్రణబ్… ఇలాం టి కారణాల రీత్యా 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. ‘అసాధారణ నాయకత్వం’ లేకపోవడంతో యూపీఏ ప్రభుత్వం ఒక సాధారణమైనదిగా మిగిలిపోయిందన్నారు.అంతేకాదు, ఈ పుస్తకంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీలో తను నెంబర్ 2గా ఉన్నానని పెద్ద ఎత్తున మీడియా చేసిన ప్రచారం కూడా వ్యూహాత్మకమేనని చెప్పిన ఆయన.. నిజానికి తన మాటలకు పార్టీలో విలువ లేకుండా పోయిందని వాపోయారు. తన మాటలకే విలువ ఉండి ఉంటే.. ఏపీ ప్రజల వాదనకు కూడా విలువ ఉండేదని చెప్పుకొచ్చారు.
అంటే.. తెలంగాణ ఏర్పాటును మెజారిటీ ఏపీ ప్రజలు వద్దని పేర్కొన్న విషయాన్ని ఆయన అన్యాపదేశం గా సదరు పుస్తకంలో ప్రస్తావించారు. అంతేకాదు, “నా మాటలకు విలువ ఉండి ఉంటే.. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని ఉండే ఉండేవాడిని!“ అని రాసుకొన్నారు. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో పేర్కొన్న ఈ విషయం.. రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రణబ్ నేతృత్వంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించిన ప్రణబ్ కమిటీ.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంది. బహుశ ఈ క్రమంలోనే తెలంగాణ వద్దని ఆయన పేర్కొని ఉంటారు. కానీ, రాజకీయంగా తాము బలోపేతం అవుతామని.. తిరుగులేని శక్తిగా అవతరిస్తామని తలపోసిన .. కాంగ్రెస్ అధినేత సోనియా.. ఎవరు ఎన్ని చెప్పినా.. తెలంగాణకే మొగ్గు చూపారు. ఇదే విషయాన్ని తర్వాత కాలంలో అనేక మంది నాయకులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కీలక నేత, ప్రణబ్ పుస్తకంతో మరోసారి ఈ విషయం రుజువైంది. ఏదేమైనా… తెలంగాణ విషయంలో కాంగ్రెస్ దూకుడు.. ఆ పార్టీలో నేతలకు కూడా ఇష్టం లేదనేది స్పష్టమైంది.