ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ కక్షగట్టిందని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏబీవీని టార్గెట్ చేసిన వైసీపీ కావాలనే సస్పెండ్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు, ఏబీవీ సస్పెన్షన్ సమయంలో జగన్ అనుకూల మీడియాలో
రకరకాల కథనాలు వండి వార్చారని, ఆ కథనాల వల్ల ఏబీవీ, ఆయన కుటుంబం పరువు, మర్యాదలు మంటగలిసి పోయాయని విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ సర్కార్ కు ఏబీవీ సంచలన లేఖ రాశారు. తన పరువుకు భంగం కలిగించిన ఐదుగురు వ్యక్తులు, సంస్థలపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని ఏబీవీ కోరారు. సాధారణ పరిపాలన శాఖకు రాసిన లేఖను ఏపీ సీఎస్ సమీర్ శర్మకు కూడా ఏబీవీ పంపారు. గతంలో తనపై వైసీపీ ఎమ్మెల్యేతో పాటు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని, వారిపై పరువు నష్టం దావా వేసే యోచనలో ఉన్నానని తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానెల్లతో పాటు సీఎం సీపీఆర్వో శ్రీహరిలపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని కోరారు. తన సస్పెన్షన్పై సీఎం సీపీఆర్వో తప్పుడు సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారని ఆరోపించారు. ఆ విషయాలను మీడియా ప్రసారం చేయడంతో తనతో పాటు తన కుటుంబీకులు చాలా ఇబ్బంది పడ్డారని ఏబీవీ ఆరోపించారు.
ఇక, తన సస్పెన్షన్ కాలం ముగిసినందున తనకు రూల్స్ ప్రకారం పూర్తి జీతం తక్షణమే చెల్లించాలంటూ ఇటీవల ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఏబీవీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. డీజీపీ హోదాలో ఉన్న తన సస్పెన్షన్ ను కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏబీవీ తేల్చి చెప్పారు. రెండేళ్లు పూర్తయినందున సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగిపోయినట్లేనని గతంలో రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి అని చెప్పారు.