లైగర్ సినిమా రిలీజ్ ముంగిట విజయ్ దేవరకొండ చేసిన ఓ కామెంట్ తర్వాత ఎంతగా విమర్శలకు దారి తీసిందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల కౌంట్ తన వరకు రూ.200 కోట్లతో మొదలవుతుందని అతను ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయి వంద కోట్ల మార్కును కూడా అందుకోకపోవడంతో విజయ్‌కి విపరీతమైన ట్రోలింగ్ తప్పలేదు.
ఐతే లైగర్ కలెక్షన్ గురించి ముందే మాట్లాడి తప్పు చేశానంటూ ఇకపై తన సినిమాల ఫలితాల గురించి ముందే మాట్లాడనని.. అది తనకు తాను వేసుకున్న శిక్ష అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్. కానీ ఫ్యామిలీ స్టార్ ప్రి రిలీజ్ ఈవెంట్లో లైగర్ కామెంట్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో తాను రూ.200 కోట్ల కలెక్షన్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేయడం విశేషం.
ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు ప్రేక్షకులకు అమితమైన ప్రేమను ఇచ్చారని.. దీంతో నాలుగో సినిమా అయిన గీత గోవిందంతో వంద కోట్ల కలెక్షన్ అందుకున్నానని విజయ్ చెప్పాడు. ఐతే తర్వాత 200 కోట్ల మార్కును అందుకోవాలని తాను కలగన్నానని.. లైగర్ సినిమా రిలీజ్‌కు ముందు ఆ సినిమా ఆ మార్కును అందుకుంటుందని ధీమాగా చెప్పానని విజయ్ గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అందరూ తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. ఆ ట్రోలింగ్‌కు తాను అర్హుడినే అని విజయ్ అన్నాడు.
చాలామంది అలా అగ్రెసివ్‌గా ఉండటం కరెక్ట్ కాదని అన్నారని.. తాను 200 కోట్లు కొడతానని చెప్పడం తప్పు కాదని.. 200 కోట్లు కొట్టకపోవడం తప్పని విజయ్ చెప్పాడు. ఐతే భవిష్యత్తులో ఏదో ఒకరోజు తాను 200 కోట్లు కొట్టి తీరుతానని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు.