అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల…కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ….అదే తరహాలో మడ భూములు మొదలు వెంకన్న తల నీలాల వరకు కాదేదీ అమ్మకానికి అనర్హం….అన్న రీతిలో ఏపీ సీఎం జగన్ ధోరణి ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో 120 బ్యాగుల తలనీలాలు పట్టుబడిన వ్యవహారంపై సోషల్ మీడియాలో పెనుదుమారం రేగుతోంది.
ఆ తలనీలాలు రూ.2 కోట్ల విలువైనవని, వాటిని తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించారని అంటున్నారు. చివరకు వాటిని అక్రమరవాణా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమంగా తిరుమల శ్రీవారికి చెందిన తలనీలాలు ఇతర దేశాలకు తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పోలీసులు పట్టుకున్నారంటూ ఆంగ్ల మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు.
దోపిడీలో జగన్ దారే వేరని, ఆఖరికి జుట్టును కూడా జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వదలడం లేదని ఎద్దేవా చేశారు. వెంకన్నకి భక్తులు సమర్పించే తలనీలాలను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు, ఆ తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. తలనీలాలను ఈ ప్లాట్ ఫామ్, అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపింది.
టెండర్ లో అధిక ధరతో కొనుగోలు చేసిన బిడ్డర్ తలనీలాలను ఎక్కడ విక్రయిస్తారన్న అంశంతో టీటీడీకి సంబంధం లేదని పేర్కొంది. అయితే, తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని టీటీడీ చెబుతోంది.