టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. నేడు పోలింగ్ సందర్భంగా కుప్పంలోకి వైసీపీ భారీగా స్థానికేతరులను దించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొంతమంది వైసీపీ నేతల ఇళ్లల్లో రహస్యంగా స్థానికేతర నాయకులు ఉంటున్నారని తెలుస్తోంది. అంతేకాదు, పోలింగ్ ముగిసే వరకు కుప్పంలోనే ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఖాళీగా ఉన్న ఇళ్లకు వేలాది రూపాయల అద్దె చెల్లించేందుకు స్థానికేతరులు సిద్ధమయ్యారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, స్థానికేతరుల గుర్తింపు కోసం పోలీసులు కుప్పంలో గాలింపు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక, కుప్పం మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోలింగ్ జోరుగా సాగుతోండగా.. దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. కుప్పంలోని 16వ వార్డులో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు నీళ్లు నములుతున్నారని,కుప్పంలో వైసీపీ బరితెగిస్తోందని ఆరోపిస్తూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక, చంద్రబాబు సొంత ఇలాకాలో పాగా వేయాలని వైసీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కుప్పంలో తిష్టవేసి ప్రచారం చేశారు. రాష్ట్రం మొత్తం ఓ లెక్క.. కుప్పం ఓ లెక్క అన్నట్లుగా ప్రచారం, పోలింగ్ ఉండడం విశేషం.